
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో
యర్రగొండపాలెం: మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట కొలుకుల గ్రామానికి చెందిన ప్రజలు శనివారం రాస్తారోకో చేశారు. ఈ నెల 19వ తేదీన మండలంలోని కొలుకుల విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వెలివెల చంటి మోటారు బైక్‌పై పెద్దారవీడు మండలం కుంట వద్దకు వెళ్తున్నాడు. స్థానిక అనకుంట వద్ద ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొనడంతో ఆయనతో పాటు ఆటోలో ప్రయాణం చేస్తున్న సూర్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతున్న చంటి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. చంటికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కుటుంబానికి న్యాయం చేయాలని వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో చర్చించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పి.చౌడయ్య చెప్పినా వారు సంతృప్తి చెందలేదు. మృతుడు చంటి కుటుంబాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆటోలో ప్రయాణం చేస్తూ ప్రమాదంలో గాయపడిన మండలంలోని అమానిగుడిపాడుకు చెందిన సూర్య సత్యనారాయణ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment