
గురుముఖ వ్యాఘ్రాలు
క్షోభకు గురవుతున్న తల్లిదండ్రులు..
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు కట్టుతప్పుతున్నారు. విద్యా వనాల్లో కలుపు మొక్కలుగా తయారవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన చిన్నారులపై కన్నేసి
కీచకులుగా మారుతున్నారు. వెకిలి
చేష్టలతో విద్యా వ్యవస్థకు కళంకం
తెస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో
చదువుతున్న బాలికలపై ఉపాధ్యాయులు
అకృత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు వరుసగా వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెట్టడం విచారకరం.
పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలను బాగా చదివించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే ఉపాధ్యాయులు చేసిన నిర్వాకం వల్ల తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. లైంగిక దాడికి గురైన కుటుంబాలకు న్యాయం జరగకపోవడంతో బయట తలెత్తుకోలేకపోతున్నారు. సూటిపోటి మాటలతో బంధువులు, ఇరుగుపొరుగు వారు అంటుండడంతో ఎలా జీవించాలో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా విద్యాశాఖ అధికారులు లైంగిక దాడి చేసిన కీచక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఒంగోలు సిటీ: తల్లిదండ్రుల తరువాత అంత బాధ్యతగా పిల్లల భవితను తీర్చిదిద్దాల్సిన గురువులు తమ స్థానాన్ని మరిచి దిగజారుతున్నారు. మద్దిపాడు, టంగుటూరు..కొనకనమిట్ల..కనిగిరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలపై చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు వరుసగా వెలుగు చూడడం విద్యా వ్యవస్థకే కళంకం తెస్తోంది. ఉన్నత భవితకు బాటలేసుకోవాల్సిన సరస్వతీ నిలయాల్లోనే బాలికలకు భద్రత కరువైంది. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా అమలుకు నోచుకోకపోవడంతో కీచకులు బరితెగిస్తున్నారు. ఇటీవల మద్దిపాడు మండలంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరిపి అతనిని సస్పెండ్ చేశారు. అలాగే జిల్లాలో టంగుటూరు కేంద్రానికి సమీపంలోని ఓ పాఠశాలలో చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. నాలుగో తరగతి చదువుతున్న ఆ బాలిక ఇంటికి వచ్చిన తర్వాత దుస్తులపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించిన తల్లి ఆందోళనకు గురైంది. ఏం జరిగిందన్న విషయాన్ని ఆరాతీసింది. విషయం తెలుసుకుని నివ్వెరపోయింది. విషయాన్ని సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తీసుకొచ్చింది. బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. రోజులు గడుస్తున్నా పోలీసులు, విద్యాశాఖ అధికారులు నిందితునిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆమె తన బంధువుల సాయంతో సామాజిక మాధ్యమాల్లో వీడియోను విడుదలజేసింది. ఇది సంచలనం రేకెత్తించడంతో పోలీసులు ఆఘమేఘాలపై కేసులు కట్టారు. విద్యాశాఖ అధికారులు అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఎట్టకేలకు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
బాలల హక్కుల సభ్యురాలి తనిఖీలో..
కొనకనమిట్ల మండలంలో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించేందుకు బాలల హక్కుల సంఘం సభ్యురాలు బత్తుల పద్మావతి తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ చదువుతున్న విద్యార్థినులు ఒక ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె దృష్టికి తెచ్చారు. దీంతో ఆ పాఠశాల ప్రధానోపాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇంత దారుణం జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఆమె మండిపడ్డారు. వెంటనే సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి ఆ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలు మరువక ముందే కనిగిరి పట్టణంలో మరో కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగుచూసింది. పట్టణంలోని ఓ పాఠశాలలో సైన్స్ టీచర్ బాలికల పట్ల వికృత చేష్టలపై బాధిత బాలికలంతా బయటకు చెప్పకోలేక మదనపడిపోయారు. అతని చేష్టలు శ్రుతిమించడంతో పది రోజుల ముందే ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె డీఈఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదరు ఉపాధ్యాయుడికి మెమో ఇచ్చి వదిలేయడం వివాదాస్పదంగా మారింది. ఈక్రమంలో ఓ బాలికకు రుతుస్రావం అయినప్పుడు తీవ్ర ఇబ్బంది పడటంతో ఏమైందని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో సదరు ఉపాధ్యాయుడి వికృత చేష్టల గురించి బాలిక వివరించింది. వారు బాలికకు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం ఆ ఉపాధ్యాయుడి ఇంటిని బంధువులతో కలిసి ముట్టడించారు. అదే సమయంలో పోలీసులు వచ్చి టీచర్‌ను అదుపులోనికి తీసుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయురాలిపై కూడా కేసు నమోదు చేశారు.
వివాదాస్పదంగా విద్యాశాఖ
అధికారి తీరు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులపై విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అకృత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు ఉదాసీన వైఖరి అవలంబిస్తుండడం గమనార్హం. వరుసగా జరుగుతున్న సంఘటనలపై మొక్కుబడిగా చర్యలు తీసుకుని మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనిగిరి పాఠశాలలో విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడని ప్రధానోపాధ్యాయురాలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే మెమో ఇవ్వాలని ఆదేశాలివ్వడం ఎంతవరకు సబబని బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యా వనాల్లో కీచక పర్వాలు
కాపాడాల్సిన గురువులే కాటేస్తున్నారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు రక్షణ కరువు వరుస ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళనలు తూతూ మంత్రంగా విచారణ చేస్తున్న వైనం డీఈఓ తీరుపై మండిపడుతున్న తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment