
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం స్వాధీనం
నాగులుప్పలపాడు: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన ఏజర్ల యేసుపాదం గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అతని వద్ద 25 క్వార్టర్ బాటిళ్లు, తొమ్మిది 90 ఎంఎల్ బాటిళ్లు ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. యేసుపాదంను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రేషన్‌కార్డుదారులు 31లోగా ఈకేవైసీ చేయించుకోవాలి
సంతనూతలపాడు: జిల్లాలో ఈకేవైసీ చేయించుకోని రేషన్‌కార్డుదారులంతా ఈ నెల 31వ తేదీలోగా రేషన్ డీలర్ల వద్ద తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారిణి ఎస్.పద్మశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్టు చెప్పారు. జిల్లాలో 6,61,206 బియ్యం కార్డులు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 19,37,977 మంది సభ్యులు కలరన్నారు. ఇప్పటి వరకూ 17,31,913 మంది సభ్యులు ఈకేవైసీ చేయించుకున్నారని వెల్లడించారు. మిగిలిన 2,06,064 మంది సభ్యులు ఈ నెల 31వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని పద్మశ్రీ కోరారు. రాష్ట్రమంతా ఈపీడీఎస్ విధానం అమల్లో ఉన్నందున కార్డుదారులు, సభ్యులు వేరువేరు ప్రాంతాల్లో ఉంటే వారి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ద్వారా సమీపంలోని రేషన్ డీలర్ల వద్ద ఈకేవైసీ చేయించుకోవచ్చని డీఎస్‌ఓ వివరించారు. ఈకేవైసీ కోసం జిల్లాలోని రేషన్ దుకాణాలు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలుపైబడిన సభ్యులు మాత్రమే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఇందులో భాగంగా సంతనూతలపాడు మండలం మైనంపాడులో ఈకేవైసీ ప్రక్రియను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గుణవంశీ ఆదివారం పర్యవేక్షించారు.
ఉరేసుకుని ఉపాధ్యాయిని ఆత్మహత్య
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్న చదలవాడ పద్మజ(52) ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పద్మజకు భర్త శ్రీనివాసులు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment