
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
● యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు
ఒంగోలు సిటీ: విద్యారంగ సమస్యలు, ఆర్థిక బకాయిల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బేరర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పదోన్నతుల సీనియార్టీ జాబితాలోని తప్పులను సరిచేయాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పాఠశాలల పేరుతో పక్కనున్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తోందన్నారు. దీనివలన సింగిల్ టీచర్ స్కూల్స్ పెరిగిపోయే పరిస్థితి ఉందన్నారు. 3, 4, 5 తరగతులను ఎక్కడా విలీనం చేయవద్దన్నారు. ప్రతి పంచాయతీకి విలీనంతో సంబంధం లేకుండా ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. యూపీ స్కూల్స్‌ను కొనసాగించాలన్నారు. హైస్కూళ్లలో తెలుగు మీడియం కొనసాగించాలని కోరారు. విద్యారంగ ఆర్థిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర యూటీఎఫ్ దశల వారీగా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఏప్రిల్ 5వ తేదీ తిరుపతిలో నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి స్పాట్ వేల్యుయేషన్‌లో చిన్నపిల్లలు ఉన్న వారికి, గర్భిణులకు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. యూటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ ఇటీవల నిర్వహించిన బాలోత్సవాన్ని జయప్రదం చేసినందుకు, రామిరెడ్డి మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఓ.వి.వీరారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.రవి, జిల్లా సహాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, ఐ.వి.రామిరెడ్డి, కోశాధికారి ఎన్.చిన్నస్వామి, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment