ఎంపీపీల ఉప ఎన్నికలను సజావుగా నిర్వహించాలి
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఈనెల 27 వ తేదీ జరగనున్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఉప ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. ఆమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లోని ఒక ఎంపీటీసీ, ఒక వైస్ ఎంపీపీ, ఒక కో ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురాంతకం మండలంలో 18కి 18 మంది ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ వారే. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లపాటు ఇద్దరికి ఇచ్చాం. ఒప్పందం ప్రకారం సుబ్బారెడ్డి దిగిపోయారు. ఆయన స్థానంలో ఆళ్ల ఆంజనేయరెడ్డికి కేటాయించాం. కుట్రలతో ఆళ్ల ఆంజనేయరెడ్డి స్థానాన్ని దక్కించుకోవాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి నేతల స్క్రిప్ట్ తో పోలీసులు కేసులు నమోదు చేశారు. నిస్సిగ్గుగా వైఎస్సార్‌సీపీ వారిని భయపెట్టి దక్కించుకోవాలని చూస్తున్నారు. ఒక్క స్థానం లేకుండా కూటమి గెలవాలని చూస్తోంది. చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆయనకు నిజంగా రాజ్యాంగం పై నమ్మకముంటే ఏడాది తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలిచి పదవులు పొందాలి. సీఎం చంద్రబాబుకు ధైర్యం లేదు కాబట్టే అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారు. కూటమికి ప్రజాబలం లేదు కాబట్టే ఈ తరహా తప్పుడు విధానాన్ని ఎంచుకున్నారు. ఎంపీటీసీల బలం లేకుండా ఏవిధంగా ఇక్కడ గెలవాలని చూస్తున్నారు. ఓసీ నాయకుల పై ఎస్సీలను ప్రయోగిస్తున్నారు. ప్రతిదానికి పోలీసులను అడ్డుపెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయపరమైన చర్యలకు వెనకాడం. ఎంపీపీ అయ్యే వ్యక్తి మీద ఎస్సీ, ఎస్టీ కేసులు, హత్యానేరం మోపి అధికారాలను దుర్వినియోగం చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి. యర్రగొండపాలెంలో పోలీసువారే ఎంపీటీసీలను బెదిరించి, పోలీసుస్టేషన్ పిలిపించి, వారిని ఎన్నికల బరి నుంచి తప్పించాలని చూస్తున్నారు. ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చేస్తున్న ఈ తరహా ఎన్నికల విధానాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. గెలుపు కోసం అక్రమార్గాన్ని ఎంచుకోవడం దుర్మార్గం. ఈ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిఘా మధ్యలో జరపాలి. సీసీ కెమెరాలు అమర్చాలి. యర్రగొండపాలెంలో జరుగుతున్న ఈ అరాచకాన్ని ఆపాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. ఎన్నికల్లో స్థానిక పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో మాకు అర్థం కావటంలేదు. ఏ పోలీసులు ఎవరిని బెదిరించారో మా దగ్గర ఆధారాలున్నాయి. ఆధారాలన్నింటినీ ఎన్నికల కమిషనర్ కు అందజేశాం. కూటమి కుట్రలను ప్రజల సహకారంతో అడ్డుకొంటామని’’ తాటిపర్తి చంద్రశేఖర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అంకంరెడ్డి నారాయణ మూర్తి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికల కమిషనర్ నీలంసాహ్నికి వినతి
Comments
Please login to add a commentAdd a comment