అక్రమ అరెస్టులకు భయపడకండి
యర్రగొండపాలెం: అక్రమ అరెస్ట్‌లకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. త్రిపురాంతకం మాజీ ఎంపీపీ, మండల పార్టీ నాయకుడు ఆళ్ల ఆంజనేయరెడ్డిని కూటమి నాయకుడి ఆదేశాల మేరకు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయాన్ని మంగళవారం ఎంపీటీసీ సభ్యురాలు, ఆంజనేయరెడ్డి భార్య సుబ్బమ్మ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 27వ తేదీ జరగబోయే మండల ప్రజా పరిషత్ ఉప ఎన్నికలో ఎంపీటీసీ సభ్యుడైన తన భర్త పార్టీ తరఫున ఎంపీపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని, ఏదో ఒక రకంగా ఆయనను పోటీ నుంచి తప్పించేందుకు అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరింది. ఇటువంటి అక్రమ అరెస్ట్‌లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, తనతోపాటు పార్టీ అండదండలుగా నిలుస్తుందని జగనన్న భరోసా ఇచ్చారని ఆమె ‘సాక్షి’కి తెలిపింది. అక్రమంగా అరెస్ట్ అయిన ఆళ్ల ఆంజనేయరెడ్డి విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించారు.
పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుంది వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి