TS Siricilla Assembly Constituency: TS Election 2023: మందు పొయ్య.. పైసలు ఇయ్య అంటే.. చాలా మంది ప్రశ్నించారు : మంత్రి కేటీఆర్‌
Sakshi News home page

TS Election 2023: మందు పొయ్య.. పైసలు ఇయ్య అంటే.. చాలా మంది ప్రశ్నించారు : మంత్రి కేటీఆర్‌

Published Sat, Sep 16 2023 12:36 AM | Last Updated on Sat, Sep 16 2023 10:49 AM

- - Sakshi

సిరిసిల్ల: మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో జిల్లాలో గడపగడపకూ వైద్యసేవలు అందుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఆరు నెలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు వద్ద మెడికల్‌ కాలేజీని శుక్రవారం ప్రారంభించిన అనంతరం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద జరిగిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత సభలో మాట్లాడారు.

తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో తాగు, సాగునీరు వచ్చిందని.. విద్య, వైద్యరంగాల్లో పెను మార్పులు వచ్చాయని భావిస్తే సిరిసిల్లలో నన్ను, వేములవాడ మా లక్ష్మీనర్సింహారావును గెలిపించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతోపాటు మెడికల్‌ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ, వ్యవసాయ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయన్నారు. త్వరలోనే జిల్లాకు ఆక్వా యూనివర్సిటీ రాబోతుందని తెలిపారు.

అభివృద్ధి సాధించిందని నమ్మితేనే గెలిపించండి..
సిరిసిల్ల అభివృద్ధి సాధించిందని భావిస్తేనే బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్‌ కోరారు. నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉందని, గుండె లోతుల్లోంచి చెబుతున్నానన్నారు. సిరిసిల్ల ప్రజలకు మందు పొయ్య.. పైసలు ఇయ్య అంటే.. చాలా మంది ప్రశ్నించారని.. కానీ ఇక్కడి ప్రజలపై ఉన్న నమ్మకంతోనే ఆ మాటలు చెబుతున్నానని స్పష్టం చేశారు. మధ్యమానేరులోకి గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెచ్చామని, మల్కపేట రిజర్వాయర్‌తో బీడు భూములకు సాగునీరు వస్తుందన్నారు.

1001 గురుకులాలతో నాణ్యమైన విద్యనందిస్తున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2009లో ఎమ్మెల్యేగా ఉండగా సిరిసిల్ల ఆస్పత్రికి చైర్మన్‌గా ఉన్నానని, వైద్యులు లేక అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్మలాదేవి మీకు చేతనైతే డాక్టర్లను నియమించాలని కోరారని గుర్తుచేశారు. జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో వంద మంది వైద్యులు అందుబాటులో ఉండి.. సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. జబ్బు ఏదైనా.. డబ్బులు లేకుండానే ఉచితంగా వైద్యం అందుతుందని తెలిపారు.

మోడల్‌ మెడికల్‌ కాలేజీగా మార్చుతా..
జిల్లా మెడికల్‌ కాలేజీని మోడల్‌గా మార్చుతానని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. పెద్దూరు శివారులోని మెడికల్‌ కాలేజీని సీఎం కేసీఆర్‌ వర్చువల్‌లో ప్రారంభించిన అనంతరం ఆయన జ్యోతి వెలిగించి ప్రసంగించారు. కొత్త కాలేజీ, కొత్త భవనం కావడంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయన్నారు. ఆ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్‌, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడించారు.

ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కారానికి నేను ముందుంటానని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోనే మోడల్‌ మెడికల్‌ కాలేజీగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రజుమంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అడిషనల్‌ కలెక్టర్లు ఎన్‌.ఖీమ్యానాయక్‌, బి.గౌతమ్‌రెడ్డి, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు మురళీధర్‌రావు, ఏఎస్పీ చంద్రయ్య, మెడికల్‌ కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జీవన నైపుణ్యాల ఒప్పందం ఆవిష్కరణ!
జిల్లాలోని కిశోర బాలికలకు జీవన నైపుణ్య శిక్షణపై టీఐఎస్‌సీ సంస్థతో జరిగిన ఒప్పందాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. మెడికల్‌ కాలేజీలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు ఒప్పంద పత్రాన్ని తీసుకురాగా.. మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు టీఐఎస్‌సీ శిక్షణ ఇవ్వనుంది.

350 నుంచి 10 వేల సీట్లకు.. : బోయినపల్లి వినోద్‌కుమార్‌
మేము చదువుకునే రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో 350 మెడికల్‌ సీట్లు ఉండేవని, ఇప్పుడు 10వేల సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే కసితో ఉన్నామని పేర్కొన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, వేములవాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, టీపీటీడీసీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, ‘సెస్‌’ చైర్మన్‌ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి చైర్మన్‌ గడ్డం నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే వి.మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థం మాధవి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ వైస్‌చైర్మన్‌ సిద్ధం వేణు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement