అనుమానితుడి ఇంటి ఎదుట ఆందోళన
చందుర్తి(వేములవాడ): చందుర్తిలో ఓ వలసకూలీ దారుణహత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి బండరాయితో మోది చంపేశారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన పులి గంగారాం(58) 25ఏళ్ల చందుర్తికి వలసవచ్చాడు. ఇక్కడే కుటుంబంతో ఉంటూ స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం వినాయక నిమజ్జన ఉరేగింపులో పాల్గొన్నాడు. రాత్రి గాంధీ విగ్రహం వద్ద ఓ షెట్టర్ ఎదుట నిద్రించాడు. వేకువజామున అటుగా వెళ్లిన గ్రామస్తులకు రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చందుర్తి సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై ఆశోక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తలపై బండరాయితో కొట్టి చంపిన గాయాలు ఉన్నాయి. హత్య జరిగిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో మురికికాలువలో బండరాయి కనిపించింది. వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి హత్య జరిగిన తీరును పరిశీలించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు డీఎస్పీని కోరారు. మృతుడి బంధువులు ఆందోళనకు సిద్ధం కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగారాంకు భార్య దేవవ్వ, కొడుకు శ్రీకాంత్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవవ్వ ఫిర్యాదు మేరకు సీఐ కిరణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పట్టించాడని.. పగ పెంచుకున్నాడా?
చందుర్తికి చెందిన ఓ బాలుడు(17) పక్షంరోజుల క్రితం మేకలు దొంగతనం చేశాడు. ఈ విషయాన్ని గంగారాం మేకల యజమానికి చెప్పాడు. ఆయన బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో బాలుడు గంగారాంపై కోపం పెంచుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి షెట్టర్ వద్ద నిద్రపోతున్న గంగారాం వద్దకు వచ్చిన బాలుడు గొడవపడి బండరాయితో హత్యచేశాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.
గంగారాంతో పాటు మరో నలుగురిని సైతం చంపేస్తానని, తనకు స్థానికంగా ప్రజాప్రతినిధుల అండ ఉందని సదరు బాలుడు ప్రచారం చేసుకుంటున్నాడని చెబుతున్నారు. అయితే సదరు బాలుడితో పాటు మరో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తమకు పరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు సర్దిచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment