
తల్లిదండ్రులు, తమ్ముళ్లతో సుధీర్‌బాబు
● తంగళ్లపల్లి ముద్దుబిడ్డ పోలీస్‌బాస్ ● గ్రూప్–1 సాధించి.. ఐపీఎస్‌గా ఎదిగి ● డీఎస్పీ నుంచి పోలీస్ కమిషనర్‌గా..
సిరిసిల్ల: తంగళ్లపల్లికి చెందిన గొట్టె భూపతి, శాంత దంపతుల పెద్ద కొడుకు సుధీర్‌బాబు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్ స్థాయి వరకు చదువుకున్నారు. సిరిసిల్ల జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసిన ఆయన ఉమ్మడి రాష్ట్రస్థాయిలో పోటీ పరీక్షల్లో ర్యాంకు సాధించి కర్నూలు సిల్వర్ జూబ్లీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించారు. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎంపికైంది సుధీర్‌బాబు ఒక్కరే. ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎంఏ చదివారు. ఎంఫిల్ పూర్తిచేసి, పీహెచ్‌డీ చేస్తుండగా 1991లో గ్రూపు–1 రాశారు. తొలి ప్రయత్నంలోనే సుధీర్‌బాబు డీఎస్పీగా ఎంపికయ్యారు.
కుటుంబ నేపథ్యం
సుధీర్‌బాబు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. తంగళ్లపల్లికి చెందిన గొట్టె భూపతి రెండుసార్లు నేరెళ్ల ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. 1967, 1972లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొట్టె భూపతి నేరెళ్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సుధీర్‌బాబు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుధీర్‌బాబు సోదరుడు గొట్టె సుమన్‌బాబు 2001లో ఇల్లంతకుంట జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. తర్వాత గుండెపోటుతో మరణించారు. మరో సోదరుడు సుజన్‌బాబు ఎంబీఏ పూర్తిచేసి వ్యాపారంలో స్థిరపడ్డారు. సుధీర్‌బాబుకు భార్య ఉమాభారతి, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
డీఎస్పీ నుంచి కమిషనర్ వరకు..
శిక్షణ పూర్తి చేసుకున్న సుధీర్‌బాబు డీఎస్పీగా నల్లగొండ జిల్లా భువనగిరిలో తొలి పో స్టింగ్ పొందారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పనిచేశారు. ఏఎస్పీగా ఏలూరు, ఖమ్మం, విజయవాడలో డీసీపీగా పనిచేశారు. ఇంటలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా తిరుపతిలో పనిచేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, సైబరాబాద్ డీసీపీగా పనిచేశారు. సుధీర్‌బాబుకు ఐపీఎస్ కన్‌ఫం కావడంతో హైదరాబాద్ అప్పాలో కమాండెంట్‌గా పనిచేశారు. మహబూబ్‌నగర్(పాలమూరు) ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్, నార్త్‌జోన్ డీసీపీగా పనిచేశారు. వరంగల్ కమిషనరేట్ తొలి పోలీసు కమిషనర్‌గా సుధీర్‌బాబు పనిచేశారు. పోలీస్‌శాఖలో డీఎస్పీగా చేరి ఐపీఎస్ ర్యాంకు సాధించిన సుధీర్‌బాబు వరంగల్ పోలీస్‌బాస్‌గా సేవలందించారు. అనంతరం హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. తాజాగా రాచకొండ కమిషనర్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాలన్నీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంటాయి. అత్యంత ప్రాముఖ్యత గల నగర శివారు ప్రాంత శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యతల్లో మన జిల్లా బిడ్డ పోలీస్ ఆఫీసర్‌గా నియమితులు కావడం విశేషం. వృత్తిపరంగా ఆయన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. పల్లెటూరిలో పుట్టిన సుధీర్‌బాబు ఉన్నత లక్ష్యంతో శ్రమించి చదువులో రాణించి ఉన్నతమైన ఉద్యోగంలో కొనసాగుతూ నేటితరం యువతకు ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
పల్లెటూరిలో పుట్టిన బిడ్డ నగర కమిషనర్ స్థాయికి ఎదిగారు. సర్కారు బడిలో చదువుకున్న విద్యార్థి ఉన్నత లక్ష్యంతో
ముందుకెళ్లి ఐపీఎస్ సాధించారు. క్రమశిక్షణ.. అంకితభావం, చిత్తశుద్ధితో ఉన్నత స్థాయికి ఎదిగారు జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన గొట్టె సుధీర్‌బాబు. గ్రూప్–1 ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి ఐపీఎస్ సాధించిన పోలీస్‌బాస్ సుధీర్‌బాబు ప్రస్థానంపై ‘సాక్షి’
ప్రత్యేక కథనం..

గొట్టె సుధీర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment