ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవద్దు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):
జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. నిత్యం పల్లెల్లో ఇసుక కయ్యం జరుగుతోంది. గతంలో స్థానిక అవసరాలకు మానేరు శివారు గ్రామాలకు అక్కడి నుంచే ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతులు ఇచ్చేవారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా మండలానికో ఇసుకరీచ్ మాత్రమే అనుమతించడంతో ఇతర గ్రామాలకు ఇసుక దొరకడం లేదు. అంతేకాకుండా ఇసుక రీచ్ ఉన్న గ్రామంలోని రైతులు తమ బోర్లు, వ్యవసాయబావులు ఎండిపోతున్నాయని ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల పలు మండలాల్లో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. ఇసుక దొరక్క చాలా నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సైతం ఇసుక కొరత వేధిస్తోంది. ఒకప్పుడు ట్రాక్టర్ లోడ్‌కు రూ.2500 ఉండగా, ప్రస్తుతం రూ.5వేలు పలుకుతోంది. ఇసుక బంగారంతో సమానం కావడం ఇళ్లు నిర్మించుకునే సామన్యులకు భారంగా మారింది.
గతంలో ఇలా..
జిల్లాలో గతంలో స్థానిక అవసరాల కోసం సమీపంలోని వనరుల నుంచి ఇసుక తోడేందుకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఆ సమయంలో జిల్లాలో సుమారు 40 చోట్ల ఇసుక తవ్వుకునేందుకు అవకాశం ఉండేది. ఆయా ప్రాంతాల నుంచి ఇసుక తరలింపునకు అధికారికంగా రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చేవారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లి, వెంకటాపూర్, బండలింగంపల్లి, వీర్నపల్లి మూలవాగు, కోనరావుపేట మండలం బావుసాయిపేట, మామిడిపల్లి రీచ్‌ల నుంచి ఇతర గ్రామాలకు తెచ్చుకునేవారు. తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లి, గండిలచ్చపేట వద్ద మానేరువాగు, నక్కవాగుల నుంచి అనుమమతులతోనే ఇసుక తోడేవారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్, రామలక్ష్మణపల్లి, తుర్కపల్లి మానేరువాగు నుంచి ఇసుక తీసుకెళ్లేవారు. వేములవాడ, వేములవాడరూరల్ సమీప మూలవాగులో ఇసుకరీచ్ నుంచి సరఫరా అయ్యేది.
అంతటా ఆందోళనలు
జిల్లాలోని పలు ఇసుకరీచ్‌ల వద్ద స్థానిక గ్రామస్తులు, రైతులు ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. తమ గ్రామంలోని ట్రాక్టర్లకే అనుమతులు ఇవ్వాలని, ఇతర గ్రామాల ట్రాక్టర్లకు ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులు ఇవ్వవద్దని రైతులు, గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని ఇసుక రీచ్‌కు ఇతర గ్రామాల ట్రాక్టర్లను రావద్దంటూ ఆ గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూర్ రీచ్ వద్ద సైతం ఇదే పరిస్థితి ఉంది. అయితే వీటి వెనుక స్థానిక ఇసుక వ్యాపారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనలు ఇలాగే కొనసాగితే మండలంలోని ఇతర గ్రామాలకు ఇసుక దొరకని పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటికే ఇసుక కొరతతో జిల్లాలోని నూతన భవన నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి.
మండలంలో అధికారికంగా ఉన్న రీచ్ నుంచే ఇసుక సరఫరా జరుగుతుంది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచే ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తున్నాం. ఇసుక ట్రాక్టర్లను ఎవరూ అడ్డుకోవద్దు. ఎవరైనా అడ్డుకుంటే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ,
డిప్యూటీ తహసీల్దార్, ఎల్లారెడ్డిపేట
Comments
Please login to add a commentAdd a comment