పైసలు పడ్డాయా !
● సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తే చాలు అలర్ట్ ● సర్వే డబ్బులు వచ్చాయేమోనని తనిఖీ ● సమగ్ర కుటుంబ సర్వే పూర్తయి మూడు నెలలు ● సిబ్బందికి అందని పారితోషికం ● ఇటీవల కలెక్టర్‌కు మొరపెట్టుకున్న ఆపరేటర్లు
సిరిసిల్ల: ట్రింగ్‌మని మెసేజ్ సౌండ్ వస్తే చాలు సెల్‌ఫోన్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు.. డబ్బులు జమకాలేదని తెలుసుకొని ఉసూరుమంటున్నారు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బంది. సర్వే పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా పారితోషికం డబ్బులు రాకపోవడంతో ఇటీవల కొందరు జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాకు ప్రజావాణిలో విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా 1,488 మంది ఎన్యూమరేటర్లు, 160 మంది సూపర్‌వైజర్లు, 1,300 మంది కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. వీరంతా పారితోషికం కోసం ఎదురుచూస్తున్నారు.
45 రోజులు సర్వే పనులు
జిల్లా వ్యాప్తంగా 45 రోజులపాటు సామాజిక సర్వే చేపట్టారు. ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సీవోలు, డీఆర్‌డీఏ సిబ్బంది, జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు భాగస్వాములయ్యారు. ఎన్యూమరేటర్‌కు రూ.10వేలు, సూపర్‌వైజర్‌కు రూ.12వేలు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.12వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు.
బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకుని..
సామాజిక సర్వేలో భాగస్వాములైన అందరి బ్యాంకు అకౌంట్ నంబర్లను మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు సేకరించారు. సర్వే పూర్తయిన తరువాత డబ్బులు వస్తాయని జిల్లాస్థాయి అధికారులు నమ్మకంగా చెప్పడంతో ఎంతో ఆశతో సర్వేను సమగ్రంగా సకాలంలో పూర్తిచేశారు. నవంబరు, డిసెంబరు నెలల్లో సర్వే పూర్తి కాగా.. పారితోషికం మాత్రం రాలేదు.
సర్వే స్వరూపం
గ్రామాలు: 261
పట్టణాలు: సిరిసిల్ల, వేములవాడ
మండలాలు : 12
కుటుంబాలు : 1,90,626
జనాభా : 5,52,037
ఎన్యూమరేటర్ బ్లాక్‌లు : 1,468
ఎన్యూమరేటర్లు : 1,488
సూపర్‌వైజర్లు : 160
కంప్యూటర్ ఆపరేటర్లు : 1,300
ప్రభుత్వానికి నివేదిక అందించాం
జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, ఆపరేటర్లకు సంబంధించిన పారితోషికం కోసం ప్రభుత్వానికి నివేదిక అందించాం. సబ్‌ట్రెజరీ ద్వారా టోకెన్ నంబరు పడింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే.. వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తాం. డబ్బులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అది మా పరిధిలో లేదు.
– పీబీ శ్రీనివాసాచారి, జిల్లా ప్రణాళికాధికారి
పైసలు పడ్డాయా !
పైసలు పడ్డాయా !
Comments
Please login to add a commentAdd a comment