హైదరాబాద్: పంజగుట్టలో ఉంటున్న వాసుదేవ్ సాహు, చిత్తరంజన్, రిలీఫ్ సాహు ప్రయాణిస్తున్న బైక్ సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ చౌరస్తా నుంచి సంగీత్ చౌరస్తా వైపు వస్తూ అదుపుతప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో రిలీఫ్ చనిపోగా... మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
► సంతోష్‌నగర్‌కు చెందిన గండికోట శివ తన స్నేహితులూన జగదీష్, శివలతో కలిసి ద్విచక్ర వాహనంపై బైరామల్‌గూడ బయలుదేరారు. కర్మన్‌ఘాట్ చౌరస్తా సమీపంలో వీళ్లు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ కిందపడిపోగా ఆర్టీసీ బస్సు తలపై నుంచి వెళ్ళడంతో గండికోట శివ అక్కడికక్కడే చనిపోయాడు. మిగిలిన ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కేవలం ఈ రెండు ఉదంతాల్లోనే కాదు రాజధానిలో నిత్యం పదుల సంఖ్యలో యువత ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ‘టు వీలర్ ఫర్ టు ఓన్లీ’... అని మోటారు వాహన చట్టం స్పష్టం చేస్తున్న ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం పరిపాటిగా మారింది.
వాహనం అదుపు చేయడం అసాధ్యం...
ప్రతి వాహనానికీ దాన్ని తయారు చేసే కంపెనీ కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగానే టూ వీలర్‌ను కేవలం ఇద్దరు వినియోగించడానికి వీలుగానే రూపొందిస్తుంది. ముందు డ్రైవర్, వెనుక పిలియన్ రైడర్ మాత్రమే ప్రయాణించాలంటూ తమ నిబంధనల్లో స్పస్టం చేస్తుంది. దీనికి సాంకేతికంగానూ ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
ఇంజిన్ కెపాసిటీ
మోటారు వాహనాలకు ఉండే ప్రతి ఇంజిన్‌కు ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. దీన్నే సాంకేతికంగా ఇంజిన్ కెపాసిటీ అంటారు. ఆ వాహనం ఎందరు ప్రయాణించడానికి అనువుగా రూపొందిస్తారో... అదే సామర్థ్యంలో ఇంజిన్ అభివృద్ధి చేస్తారు. నిర్దేశించిన ప్రయణికుల కంటే ఎక్కువ మంది ఆ వాహనంపై ప్రయాణిస్తే దాని ప్రభావం ఇంజిన్‌పై పడుతుంది.
యాక్సిలరేటింగ్ కెపాసిటీ
ఓ వాహనం ఎంత వేగంతో దూసుకుపోవాలనేది స్పష్టం చేసేదే యాక్సిలరేటింగ్ కెపాసిటీ. సదరు వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు ఈ కెపాసిటీ తగ్గుతుంది. సాధారణంగా గంటకు 60 కిమీ వేగంతో దూసుకుపోయే వాహనం ఇలాంటప్పుడు 40 కిమీ మించదు. ఈ ప్రభావం ఓవర్‌టేకింగ్ తదితర సమయాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది.
బ్రేకింగ్/బ్యాలెన్సింగ్ కెపాసిటీ
ఏదైనా వాహనం ప్రమాదానికి లోనుకాకుండా ఉండాలంటే ఈ రెండూ అత్యంత కీలకం. సరైన సమయానికి బ్రేక్ వేయగలగటం, అవసరమైన స్థాయిలో బ్యాలెన్స్ చేసుకోవడం తప్పనిసరి. అయితే ట్రిపుల్ రైడింగ్ వంటివి చేసినప్పుడు ఈ ప్రభావం ఈ రెండు కెపాసిటీల పైనా పడి... ఎదురుగా ముప్పు ను గుర్తించినా తక్షణం స్పందించి వాహనాన్ని ఆపలేరు.
త్వరలో చార్జ్‌షీట్స్ దాఖలు చేస్తాం
డ్రంక్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం, మైనర్ డ్రైవింగ్ మాదిరిగా ట్రిపుల్ రైడింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇప్పటి వరకు రూ.1000 జరిమానా మాత్రమే విధిస్తున్నాం. త్వరలో కోర్టుల్లోనూ అభియోగపత్రాలు దాఖలు చేయనున్నాం. ఎందరో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ట్రిపుల్ రైడింగ్‌ను అదుపు చేయడానికి యువకుల తల్లిదండ్రులు, కుటుంబీకుల సహకారం కూడా ఎంతో అవసరం.
– ట్రాఫిక్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment