రంగారెడ్డి: ఆమనగల్లు ఎంపీపీ అనితపై అవిశ్వాస తీర్మాణం పెట్టేందుకు ఎంపీటీసీ సభ్యులు కందుకూరు ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. సొంత పార్టీకి చెందిన నేతలే ఎంపీపీ అనితపై అవిశ్వాస తీర్మాణం పెట్టడం విశేషం. ఆమనగల్లు మండల పరిషత్ పరిధిలో 5 ఎంపీటీసీ స్థానాలుండగా గత ఎన్నికల్లో 5 ఎంపీటీసీ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకోగా ఆ పార్టీకి చెందిన మేడిగడ్డ ఎంపీటీసీ అనిత ఎంపీపీగా, మంగళపల్లి ఎంపీటీసీ జక్కు అనంతరెడ్డి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
అనంతరం జరిగిన పరిణామాలతో ఎంపీపీ అనిత ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో విభేదించి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గంలో చేరారు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఎంపీపీ అనితను పదవినుంచి దించేందుకు మిగతా ఎంపీటీసీలు ప్రయత్నిస్తున్నారు. కాగా ఎంపీపీ అనితపై అవిశ్వాసం ప్రకటిస్తూ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, కోనాపూర్ ఎంపీటీసీ సరిత, పోలెపల్లి ఎంపీటీసీ దోనాదుల కుమార్, ఆకుతోటపల్లి ఎంపీటీసీ నిట్టె మంగమ్మ సంతకాలు చేసి ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు నోటీసు అందించినట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment