
గురుకులంలో క్రీడా సంబురం
● నేటి నుంచి 10వ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ ● హాజరుకానున్న 1,200 మంది విద్యార్థినులు ● కమ్మదనం గురుకుల పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి
షాద్‌నగర్‌రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా షాద్‌నగర్ పరిధిలోని కమ్మదనం గురుకుల పాఠశాలలో గురువారం నుంచి 10వ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ జరగనుంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలను 20 జోన్లుగా విభజించి జోనల్ స్థాయి క్రీడలు నిర్వహించారు. వీటిల్లో గెలుపొందిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి జోనల్ పోటీలను షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కమ్మదనం గురుకుల పాఠశాల ఆవరణలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
క్రీడా విభాగాలు ఇవే..
పోటీల్లో వివిధ గురుకుల పాఠశాలలకు చెందిన 1,200 మంది విద్యార్థినులు పాల్గొననున్నారు. అండర్– 14, –17, –19 విభాగాల్లో వాలీబాల్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, ఖోఖో, కబడ్డీ, చెస్, క్యారం, టెన్నికాయిట్, అథ్లెటిక్స్‌లో పోటీలు ఉంటాయి.
ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్రస్థాయి క్రీడల నిర్వహణకు పాఠశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కమిటీలను ఏర్పాటు చేసి ఇన్‌చార్జిలను నియమించారు. బుధవారం గురుకుల పాఠశాలల మల్టీజోనల్ ఆఫీసర్ రజిని, జోనల్ ఆఫీసర్లు నిర్మల, ఫ్లారెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు.
అన్ని సౌకర్యాలు
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో 1,200 మంది విద్యార్థినులు పాల్గొంటున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– విద్యుల్లత , ప్రిన్సిపాల్, కమ్మదనం గురుకుల పాఠశాల

గురుకులంలో క్రీడా సంబురం
Comments
Please login to add a commentAdd a comment