
భూ సేకరణ విరమించుకోవాలి
యాచారం: పారిశ్రామిక పార్క్‌ల పేరుతో చేపట్టే భూ సేకరణను విరమించుకోవాలని మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. గ్రామంలో 820 ఎకరాల అసైన్డ్, పట్టా భూముల సేకరణను వెంటనే నిలిపేయాలని కోరుతూ మంగళవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు పండే భూములను తీసుకుంటే జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూ సేకరణను వెంటనే విరమించుకోకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ అనంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రెండు, మూడు రోజుల్లో గ్రామాన్ని సందర్శించి సర్కార్‌కు నివేదిక ఇస్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. అంతకు ముందు రైతులంతా సమావేశమై భూసేకరణను వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో మర్పల్లి అంజయ్య యాదవ్, మేకల యాదగిరిరెడ్డి, తాండ్ర రవీందర్, బండిమీది కృష్ణ, నక్క శ్రీనువాస్ యాదవ్, కుంచారపు సందీప్‌రెడ్డి, మాదం జంగయ్య, బాల్‌రాజ్, పాండు యాదవ్, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మధ్యాహ్న భోజనం కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం చంద్రమోహన్ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్నతో కలిసి మాట్లాడారు. ఎనిమిది నెలల పెండింగ్ బిల్లులు, మూడు నెలల వేతనాలు వెంటనే ఇప్పించాలని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఈ నెల 24న జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వంట బంద్ చేసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు జయమ్మ, సావిత్రి, రజిత, శివ రాణి, శిరీష తదితరులు పాల్గొన్నారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వర్గీకరణను ఉభయ సభలు ఒకేరోజు ఆమోదించడం హర్షణీయమన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన ఫిబ్రవరి 24న తెలంగాణ సోషల్ జస్టిస్‌డేగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి సూచించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్నారు. కులగణనపై కూడా సరైన నిర్ణయం తీసుకొని అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్
సభ్యుడిగా వెంకట్‌రెడ్డి
మంచాల: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన వింజమూరి వెంకట్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధినాయకత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సందర్భంగా మంగళవారం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో క్రమశిక్షణతో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

భూ సేకరణ విరమించుకోవాలి

భూ సేకరణ విరమించుకోవాలి