
బైక్‌ను ఢీకొన్న కారు
మహేశ్వరం: ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని కల్వకోల్ గేటు సమీపంలో మన్సాన్‌పల్లి చౌరస్తా–దుబ్బచర్ల మధ్యలో చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్య(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన మహేశ్వరానికి వ్యక్తిగత పని మీద బైక్‌పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన కొండని ప్రశాంత్ కారులో వస్తూ కల్వకోల్ చౌరస్తా వద్ద ముందున్న బైక్‌ను వెనుకాల నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకరయ్య తలకు బలంగా దెబ్బ తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రోడ్డుపై వెళ్లే వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని ఎస్‌ఐ మధుసూదన్ తెలిపారు.
దాయాదులపై ఫిర్యాదు
ఇదిలా ఉండగా తన భర్త శంకరయ్య మృతి పట్ల అనుమానాలున్నాయని భార్య కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల నుంచి తమకున్న భూమిపై దాయాదులతో వివాదం ఉందన్నారు. ఇటీవల కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని తన భర్త చెప్పాడన్నారు. భూమి దక్కదనే ఆలోచనతో దాయాదులు కారు డ్రైవర్‌కు సుపారి ఇచ్చి రోడ్డు ప్రమాదం చేయించి హత్య చేయించారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. గ్రామంలో శంకరయ్య మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.
● అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం
● మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబీకులు
● కల్వకోల్ గ్రామంలో విషాదం