
బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్టు
రాజేంద్రనగర్: బెల్టు షాపుపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి మద్యంతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల సమాచారం మేరకు... బండ్లగూడ మల్లికార్జున్‌నగర్ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్ కిరణాషాపు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా షాపులోనే మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. ఆదివారం డ్రైడే కావడంతో మద్యాన్ని విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు దుకాణంపై దాడి చేసి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బియ్యం పంపిణీ
మన్సూరాబాద్: దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నా పేదల ఆకలిని తీర్చలేకపోవడం అత్యంత బాధాకరమని రైస్ ఎటీఎం నిర్వాహకుడు, సామాజిక కార్యకర్త దోసపాటి రాము ఆవేదన వ్యక్తం చేశారు. నాగోలు డివిజన్ పరిధి రాక్‌హిల్స్‌కాలనీలోని రైస్ ఎటీఎం వద్ద ఆదివారం ఆయన పేదలకు ఉచితంగా బియ్యం పంపీణీ చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు గుర్తించి కొత్త రేషన్ కార్డులు అందజేసి బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించి అర్హులైన పేదలను గుర్తించడంలో పాలకులు అశ్రద్ధ వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.