
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగులోకి..
రసూల్‌పురా: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్ నగర్ శ్రీనిధి ఆపార్ట్‌మెంట్‌లో మీనా చంద్రన్ (59 ), వీణా చంద్రన్ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్‌మెంట్ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డాక్యుమెంట్ రైటర్ల నిరసన
రాజేంద్రనగర్: స్లాట్ విధానం వద్దు..పాత పద్ధతే కొనసాగించాలని నిరసిస్తూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మంగళవారం తెలంగాణ డాక్యుమెంట్ రైటర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దస్తవేజు లేఖర్లు (డాక్యుమెంట్ రైటర్లు) ప్ల కార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గురువారం, శనివారాలు డాక్యుమెంట్ రైటర్‌లు ఆఫీసులను మూసి వేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింహులు గౌడ్, యాదగిరి, జీవం రెడ్డి, శర్మ, రఫీ, క్రాంతికుమార్, ఖదీర్, రమేశ్, సాయినాథ్, పవన్, అస్లాం, ప్రభాకర్ రెడ్డి, బలరాం, జూబైర్, కస్యం మల్లేష్, శ్యామ్ ఆనంద్ పాల్గొన్నారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు
బండ్లగూడ: అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే వాటిపై చర్యలు తీసుకుంటామని బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్‌చంద్ర సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని పీఅండ్‌టీ కాలనీలోని ప్లాట్ నంబర్ 29–సీ బ్లాక్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తు నిర్మాణాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నిర్మాణాలు చేసే ముందే పూర్తి అనుమతులు తీసుకోవాలన్నారు.