
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
చేవెళ్ల: సొంతూరుకు వెళ్తానని బయలుదేరిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలం మక్తగూడ గ్రామానికి చెందిన బుత్తుల వెంకటయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కొంత కాలంగా చేవెళ్లలో నివాసముంటున్నాడు. కాగా ఈ నెల 15న ఉదయం 8 గంటల సమయంలో సొంతూరు మక్తగూడకు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. తరువాత అతని భార్య శ్రీలత ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మక్తగూడకు వెళ్లి ఉండవచ్చని భావించి బుధవారం రాత్రి శ్రీలత తన అత్తకు ఫోన్ చేసింది. ఆయన అక్కడికి వెళ్లలేడని తెలిసి గురువారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
మొయినాబాద్: ఇంట్లోనే ఉరి వేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిగూడలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌరొళ్ల వెంకటస్వామికి పదేళ్ల క్రితం మొదటి భార్య మరణించడంతో జయమ్మ(40)ని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు, రెండో భార్యకు ఒక కూతురు. మొదటి భార్య పెద్ద కొడుకు ఆరు నెలల క్రితం మృతి చెందాడు. కాగా గురువారం వెంకటస్వామి పనికి వెళ్లగా జయమ్మ ఇంటి వద్దనే ఉంది. తనతోపాటు ఉన్న కూతురిని బయటకు పంపించి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇక్ఫాయ్‌లో ముగిసిన మేధో సమ్మేళనం
శంకర్‌పల్లి: మండలంలోని దొంతాన్‌పల్లిలో గల ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘ఇక్ఫాయ్ కాన్ఫరెన్స్ ఆఫ్ నేషన్స్ (ఐకాన్)–2025’ కార్యక్రమం గురువారంతో ముగిసింది. కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ కార్యనిర్వాహక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల మేధో సమ్మేళనంలో ముఖ్యంగా అంతర్జాతీయ సహకారం, న్యాయ పరిజ్ఞానం, మానవీయ సిద్ధాంతాలు, మేథో వినిమయం, కుటుంబ త్యాగాలు, శాంతి, రాజీ, పరస్పర గౌరవం, అంతర్జాతీయ సంబంధాల వంటి వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రకాశ్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎప్పటికీ న్యాయం వైపే ఉండాలని, భారత రాజ్యాంగం పట్ల విధేయతతో ఉండాలని, మానవ విలువలని నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. ఇక్ఫాయ్ వైస్ చాన్సలర్ ఎల్‌ఎస్ గణేశ్, లా స్కూల్ డైరెక్టర్ ప్రొ. రవిశేఖరరాజు మాట్లాడుతూ.. ఇలాంటి వేదికలు విద్యార్థులు జీవితంలో ఎదగడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో రీసెర్చ్ డీన్ ప్రతాప్‌రెడ్డి, అసిస్టెంట్ డీన్ డా.అరుణ్, ఐకాన్ 2025 కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను కాపాడండి
చేవెళ్ల ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన చిలుకూరు గ్రామస్తులు
మొయినాబాద్: అక్రమంగా కబ్జాలకు గురవుతు న్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని చిలుకూరు గ్రామస్తులు చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళకు ఫిర్యాదు చేశారు. గురువారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో సర్వేనంబర్ 164, 166లో ఉన్న ప్రభు త్వ భూమిని కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తొలగించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. మరోవైపు మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌కు సైతం ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రేమ్‌కుమార్, ప్రభాకర్, దేవకుమార్, పద్మారావు, ప్రశాంత్, నవీన్, జయవర్ధన్, కిరణ్, రాజు, వెంకటేష్, సునీల్, సుధాకర్, ప్రసాద్, గోపాల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు