
మహిళల కోసం ప్రోత్సాహకాలు
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలు వాణిజ్య, వ్యాపార రంగాల్లో రాణించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత అన్నారు. జిల్లా స్వయం సహాయక సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ర్యాంప్ ప్రోగ్రాం గురించి శనివారం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీహబ్‌తో జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీస్ ఆఫ్ ఎంస్‌ఎంఈ నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమం మహిళలకు ఎంతో మద్దతుగా నిలుస్తుందన్నారు. రెండేళ్ల పాటు కొనసాగుతున్న ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న మహిళా పారిశ్రామికవేత్తలు బిజినెస్ అభివృద్ధిని వేగవంతం చేసుకొని తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఇందులో భాగంగా టెక్స్‌టైల్స్, ఫుడ్ మాన్యుఫాక్షరింగ్, హస్తకళల వంటి రంగాల్లోని వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ డైవర్సీఫికేషన్, బ్రాండింగ్, మార్కెట్ యాక్సెస్, క్రెడిట్‌లింకేజ్, ఎక్స్‌పర్ట్ మెంటరింగ్ మద్దతు అందనుందని తెలిపారు. అనంతరం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో వీహబ్ డైరెక్టర్ అక్తర్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఉహా సజ్జ, డీపీఎంలు, ఏపీఎంలు, స్వయం సహాయ సంఘాల మహిళలు పాల్గొన్నారు.
యూనిఫామ్ త్వరగా అందించేలా చూడాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ త్వరితగతిన అందించేలా చూడాలని డీఆర్‌డీఓ శ్రీలత ఏపీఎంలు, సీసీలను ఆదేశించారు. విద్యార్థులకు సరైన కొలతలు తీసుకోవాలని తెలిపారు. క్లాత్ వచ్చిన తరువాత ఏవిధంగా కటింగ్ చేయాలో కొలతల ప్రకారం కుట్టేలా చూడాలని సూచించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత