
రూ.74.56 లక్షల హవాలా డబ్బు స్వాధీనం
గచ్చిబౌలి: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాల డబ్బును రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బులు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్‌లో ఎస్‌ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్‌కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్‌లోని సురెందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్‌తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్‌కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులు తెలిపారు. లెక్క చూపించని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయత్నించినా పట్టుబడలేదు.విశ్వసనీయ సమాచారంతో ఎట్టకేలకు భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు.