‘‘చేతిలో ఫోన్ పెడితే చాలు మనం పెట్టిందంతా వద్దనకుండా మా బుడ్డోడు తినేస్తాడు’’ ‘‘మేమిద్దరం మూవీ చూడాలనుకుంటే బుజ్జిదాని చేతికి ఫోనిస్తాం. అది అల్లరి చేయకుండా యూట్యూబ్‌లో కార్టూన్ చానెల్ తానే సెలక్ట్ చేసేసుకుని మరీ చూస్తుంది తెలుసా?’’ఇలాంటి మాటలు వినపడని ఇల్లూ, అనని ఇల్లాళ్లూ సిటీలో కనపడడం అరుదై పోయింది. అయితే తమ పనులు సులభంగా కావడానికి పెద్దలు ఉపయోగించే ఈ రకమైన చిట్కాలు పసిపిల్లల భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపించనున్నాయని యువతలో కనపడుతున్న తీవ్రమైన ఫబ్బింగ్ స్థితి పిల్లల్లోనూ మొదలవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చుట్టుపక్కల పరిస్థితుల్ని మర్చిపోయేంతగా ఫోన్‌లో మునిగిపోవడమే ‘‘ఫబ్బింగ్’’ గా వ్యవహరిస్తున్నారు. 2012లో ఫోన్, స్నబ్బింగ్ పదాల్ని మేళవించి ఓ ఆ్రస్టేలియా యాడ్స్ సంస్థ దీన్ని సృష్టించింది. ఆ తర్వాత ఇది వాడుక పదంగా మారిపోయింది. గతంలో ఈ ఫబ్బింగ్ అనే స్థితి నగరంలోని సగానికి పైగా యువకుల్లో కనిపిస్తోందని ‘కన్సీక్వెన్స్ ఆఫ్ ఫబ్బింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్ అమాంగ్ ది హైదరాబాద్’ అనే అధ్యయనం వెల్లడించింది. అదే పరిస్థితికి చిన్నారులు కూడా చేరేలా ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
మహమ్మారితో మరింతగా...
పసివయసును దృష్టి మరల్చడానికి గతంలో అరకొరగా కనిపించిన ఫోన్ చిట్కా...కరోనా నేపథ్యంలో నగరంలో మరింతగా పెరిగిందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, పిల్లలకు స్కూల్స్ లేకపోవడం..తల్లులకు పనుల భారం పెరగ డం..ఇవన్నీ కలిపి పిల్లలకు చేజేతులా ఫోన్‌ను అలవాటు చేసే దిశగా పెద్దల్ని మరింతగా ప్రేరేపించాయి. ఏడిచే పిల్లల్ని ఊరుకోబెట్టడం, తిండి తినకుండా మారాం చేసే పిల్లల్ని ఏమార్చి తినిపించడం, అల్లరి మానిపించడం...ఇలా అనేక అవసరాలకు ఫోన్ ఏకైక సులభ పరిష్కారంగా అవతరించడం పలు రకాల సమస్యలు తెచ్చిపెడుతుందని వైద్యులు అంటున్నారు.
నేటి నిశ్శబ్ధం...రేపటి యుద్ధం...
పారాడే పిల్లలకి ఫోన్ అలవాటు చేయడం వల్ల వారి మాట్లాడే దశ మరింత ఆలస్యం కావచ్చునని నగరానికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.అనిత హెచ్చరిస్తున్నారు. పిల్లల్ని నిశ్శబ్ధంగా ఉంచడానికి పెద్దలు చేసే ఈ ప్రయత్నం వారిని మౌనంగా మార్చవచ్చు, అలాగే మాటలపట్ల ఆసక్తి తగ్గిపోతుందని, అలాగే భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వారికి కష్టమవుతుందని ఆమె పేర్కొన్నారు. తద్వారా పెరిగి పెద్దయే దశలో ఇతరులతో ఎలా మెలగాలో అర్థం కాక సతమతమవుతారని, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతాయని స్పష్టం చేస్తున్నారు.
పిల్లల్ని తినిపించడానికి ఫబ్బింగ్‌కు గురి చేయడం శారీరక అనారోగ్యాలకు దారి తీస్తుందన్నారు. ఆహారం తీసుకునేటప్పుడు ఫోన్‌లో ఆడుకోవడం, లేదా ఏదైనా తదేకంగా చూడడం అతిగా తినడానికి, ఒబెసిటీకి దారి తీస్తాయన్నారు. కాస్త ఓపికగా వ్యవహరించడం తగినంత సమయం వెచ్చిస్తే పిల్లలను అదుపు చేయడం సమస్య కాదని దానికి బదులుగా వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే పరిష్కారాలు ఎంచుకోవడం సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
యువతలో ఫబ్బింగ్ అధ్యయనం ఏం చెప్పిందంటే..
సిటిలోని ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధా బాల సహ రచయితగా ‘కన్సీక్వెన్స్ ఆఫ్ ఫబ్బింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్ అమాంగ్ ది హైదరాబాద్’ అనే అధ్యయనం నగర యువతలో పబ్బింగ్ సర్వసాధారణమైపోయిందని పేర్కొంది. ఇది వారి జీవితాలను వారి స్నేహితులు కుటుంబ సభ్యులతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తేల్చింది. అధ్యయనం ప్రకారం, నగర యువతలో 52% మంది ఫబ్బింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. వీరిలో ఫబ్బింగ్ వల్ల 23% మంది అపరిమితంగా 34% మంది పరిమితంగా మానసిక ఇబ్బందులను అనుభవించారు. ఫబ్బింగ్ గేమింగ్ వ్యసనానికి కారణమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment