డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న ఫుట్‌అల్సర్స్
పాదాల పట్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణం
ప్రస్తుతం ఆధునిక జీవన శైలిలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు డయాబెటిక్ బారిన పడుతున్నారని ఒక అంచనా. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) ప్రకారం, 2023 నాటికి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 53.7 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ఆధునిక జీవనశైలి, ప్రస్తుత ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వృద్ధుల జనాభా ఆధారంగా 2045 నాటికి ఈ సంఖ్య 70 కోట్లకు పెరుగు తుందని ఓ అంచనా. 2023 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ బాధితులు అత్యధికంగా ఉన్నా దేశాల్లో భారతదేశం ఒకటి. సుమారు 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు, 2045 నాటికి 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ గణాంకాలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత మధుమేహం ప్రభావిత దేశంగా మారే అవకాశాలు లేకపోలేదు. – సాక్షి, హైదరాబాద్
ప్రతి నలుగురిలో ఇద్దరికీ ఈ సమస్య
సాధారణంగా డయాబెటిస్ బాధితులకు దృష్టిలోపానికి సంబంధించి రెటినోపతి, నరాల బలహీనతకు న్యూరోపతి, కిడ్నీ సమస్యలకు నెఫ్రోపతి సమస్యలపైనే అవగాహన ఉంది. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య ఫుట్‌అల్సర్స్ కూడా. అంటే మధుమేహ వ్యాధి రోగులకు కాలి అడుగుభాగంలో ఏర్పడే పుండు. డయాబెటిక్ వ్యాధి ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన ఈ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ఉన్న వారిలో సగటున 15 శాతం నుంచి 25 శాతం మంది తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో డయాబెటిక్ ఫుట్‌అల్సర్స్ అంటే పాదాలపై పుండ్ల బారిన పడుతున్నారు.
ఆంప్యుటేషన్స్ లేకుండా నయం చేయవచ్చు..
డయాబెటిస్ బాధితుల్లో ఇటీవల కాలంలో డయాబెటిక్ ఫుట్‌అల్సర్స్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్ రోగుల్లో పాదాల సంరక్షణపై అవగాహన లేదు. అందుకే డయాబెటిస్ బాధితులు షుగర్ నియంత్రణతోపాటు పాదాల్ని సంరక్షించుకోవాలి. చిన్న గాయమైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. డయాబెటిక్ ఫుట్‌అల్సర్స్‌కు ఆంప్యుటేషన్ చేయకుండానే పూర్తిగా నయం చేసే అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం. ఫుట్‌అల్సర్స్‌తోపాటు, గ్యాంగ్రీన్, సెల్యూలైటిస్, కాలిన గాయాలకు కూడా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్తిగా నయం చేస్తున్నాం. – డాక్టర్. భరత్‌కుమార్, చైర్మన్ కేబీకే మలీ్టస్పెషాలిటీ హాస్పిటల్స్
చక్కర శాతం పెరగడంతో..
డయాబెటిక్ ఫుట్‌అల్సర్‌కు ప్రధాన కారణం రక్తంలో చక్కర (గ్లూకోజ్) శాతం పెరిగిపోవడం. సాధారణంగా షుగర్ నియంత్రణ లేనివారికి రక్తం చిక్కబడుతుంది. రక్తనాళాల్లో షుగర్ పేరుకుపోయి కాలు చివరి భాగాల్లోకి బ్లడ్ సర్యు్కలేషన్ తగ్గిపోతుంది. తద్వారా పాదం స్పర్శ కోల్పోతుంది. కొంత కాలానికి ఫుట్‌అల్సర్స్‌గా మారుతాయి. చివరికి అదే గ్యాంగ్రీన్‌కి కూడా దారి తీస్తుంది. ఇతర డయాబెటిక్ సమస్యల కంటే ఎక్కువగా ఆస్పత్రిలో చేరడానికి ఈ డయాబెటిస్ ఫుట్‌అల్సర్స్ కారణమవుతున్నాయి. మనదేశంలోని మధుమేహ బాధితుల్లో సుమారు 10 శాతం మందికి డయాబెటిక్ ఫుట్‌అల్సర్ (డీఎఫ్‌యు) వచ్చే అవకాశం ఉంది. అంటే దేశంలో ఏటా 70 లక్షల మంది ప్రజలు ఈ ఫుట్‌అల్సర్స్ బారిన పడుతున్నారు.
ప్రాణాంతకం కూడా..
షుగర్ వ్యాధిగ్రస్తులు ఫుట్‌అల్సర్స్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. అల్సర్స్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు విస్తరించి గ్యాంగ్రీన్‌గా మారితే మెజారిటీ కేసుల్లో ఆయా భాగాలను తొలగించడం (ఆంపుటేషన్) తప్ప వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఫుట్‌అల్సర్స్ వల్ల చాలామందిలో కాలు తీసేయాల్సి వస్తోంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ కారణంగా 3 ఏళ్లలోనే రెండో కాలు కూడా తొలగించాల్సిన ముప్పు 30 నుంచి 40 శాతానికి పెరుగుతోంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. డయాబెటిక్ ఫుట్‌అల్సర్ల నుంచి వచ్చే సమస్యల ఫలితంగా మన దేశంలో ఏటా లక్ష ఆంప్యుటేషన్స్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అప్రమత్తతే శ్రీరామరక్ష..
ఆంప్యుటేషన్స్‌తో పాటు ప్రాణాలు తీస్తున్న డయాబెటిక్ ఫుట్‌అల్సర్స్‌కు అప్రమత్తతే శ్రీరామరక్ష. డయాబెటిస్ ఉన్నవారు తమ పాదాలను సంరక్షించుకోవడం చాలా అవసరం. సరైన పాదరక్షలు ధరించడం, తరచూ పాదాలను పరీక్షించుకోవడం, ఏదైనా గాయం అయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం వల్ల అల్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కూడా కీలకం. ఆరోగ్య సంరక్షణ నిపుణులు డయాబెటిస్ బాధితుల్లో పాదాల సంరక్షణకు సంబంధించి అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment