సంగారెడ్డి: పంట చూసేందుకు వెళ్లిన కౌలు రైతు విద్యుత్ షాక్ గురై మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (35) తనకున్న 2 ఎకరాలతోపాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.
కౌలు భూమి చుట్టూ ఫెన్సింగ్ వైరు ఏర్పాటైంది. కరెంట్ స్తంభం నుంచి వైరు తెగిపడి ఫెన్సింగ్‌పై పడింది. పంట పరిశీలనకు ఒక వైపు నుంచి వెళ్లి మరో వైపు నుంచి తిరిగొస్తుండగా ఫెన్సింగ్ వైర్ తగిలి షాక్‌తో అక్కడికక్కడ మరణించాడు. అతడికి భార్య నాగమణి, ఇద్దరు పిల్లలున్నారు. నాగమణి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే వ్యవసాయ పొలాల వద్ద వెళాడుతున్న విద్యుత్ వైర్లు సరిచేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. సంఘటనా స్థలం వద్దకొచ్చిన లైన్‌మెన్, ఇద్దరు సిబ్బందిని గేరావ్ చేశారు. ఉన్నతాధికారులు పరిహారం ప్రకటించేంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదని భీష్మించారు. పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పి శాంతింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment