
గాంధీనగర్‌లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జిన్నారం(పటాన్‌చెరు): ఏ తల్లీ తన కన్నపేగును తెంచుకోవాలనుకోదు. అయితే రెండు లేక మూడురోజుల శిశువు చెత్త కుప్పలో విగతజీవిగా కనిపించింది. ఈ హృదయ విదారకర ఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. కుక్కలు శరీరంలో కొంతవరకు తినివేయడం ప్రతిఒక్కరినీ కల్చి వేసింది. పోలీసుల కథనం ప్రకారం... గాంధీనగర్‌లోని చెత్తకుప్పలో పడేసిన ఒక బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తోంది. దానిని కుక్కలు నోటి ద్వారా కరుచుకొని బయటకు తెచ్చి శిశువుకు చెందిన కొంత భాగాన్ని తినేశాయి. పురిట్లోనే మృతిచెందిందా? లేదా హత్య కోణం ఏమైనా ఉన్నది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని సీఐ నయీమొద్దీన్ తెలిపారు.
చెత్త కుప్పలో మృతశిశువు
బొల్లారంలో ఘటన