సాక్షి, మెదక్: రాష్ట్ర రాజకీయాల్లో ‘అందోలు’ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులయ్యారు. 1952లో అందోల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు మాత్రమే స్థానిక ఎమ్మెల్యేలు గెలుపొందగా, మిగితా వాటిలో స్థానికేతరులు గెలుపొందారు. మొత్తంగా తొమ్మిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, బీఆర్‌ఎస్ రెండు సార్లు, ఒకసారి ఇంటిపెండింట్ గెలుపొందాయి.
1952 నుంచి 1967 వరకు జనరల్ క్యాటగిరీ ఉండగా, 1967 నుంచి అందోల్ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 12 సార్లు జరిగిన ఎన్నికల్లో రాజనర్సింహ కుటుంబ సభ్యులే ఆరుసార్లు ఎన్నికయ్యారు. 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి మల్యాల రాజయ్య గెలుపొందగా ఆ ర్థిక, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు. బాబూ మోహన్ 1998 ఉప ఎన్నిక , 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు.
1989, 2004, 2009 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మూడుసార్లు గెలుపొంది. మార్కెట్, వ్యవసాయ, విద్య, ఉప ముఖ్యమంత్రి పదవులను పొందాడు. అలాగే, ఓపెన్ కేటగిరి సమయంలో జోగిపేటకు చెందిన వ్యక్తి వైశ్యుడైన బస్వ మాణయ్య స్థానిక మొదటి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తర్వాత 14 సార్లు ఎన్నికలు జరుగగా స్థానికేతరులే గెలుపొందారు. 1967లో రిజర్వుడు తర్వాత స్థానికులకు పోటీ చేసేందుకు అవకాశాలు లభించలేదు. 2018 ఎన్నికల నాటికి స్థానిక నినాదం బలపడింది. దీంతో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో వట్‌పల్లి మండలంలోని పోతులబోగుడాకు చెందిన చంటి క్రాంతికిరణ్ విజయం సాధించడంతో రెండోసారి ఎమ్మెల్యే వ్యక్తి గెలిచారు.
అందోలు ఎమ్మెల్యేలు..
1952 వెంకట రాజేశ్వర జ్యోషి (కాంగ్రెస్)
1957 బస్వ మాణయ్య (స్వతంత్ర)
1962 ఎస్.లక్ష్మిదేవి (కాంగ్రెస్)
1967 రాజనర్సింహ (కాంగ్రెస్)
1972 రాజనర్సింహ (కాంగ్రెస్)
1978 రాజనర్సింహ (కాంగ్రెస్)
1983 హెచ్.లక్ష్మణ్ జీ (కాంగ్రెస్)
1985 మల్యాల రాజయ్య (టీడీపీ)
1989 దామోదర్ (కాంగ్రెస్)
1994 మల్యాల రాజయ్య (టీడీపీ)
1998 పి.బాబుమోహన్ (టీడీపీ)
1999 పి.బాబుమోహన్ (టీడీపీ)
2004 దామోదర (కాంగ్రెస్)
2009 దామోదర (కాంగ్రెస్)
2014 బాబుమోహన్ (టీఆర్‌ఎస్)
2018 చంటి క్రాంతికిరణ్ (టీఆర్‌ఎస్)
ఇవి చదవండి: తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment