
నాగులపల్లిలో పోలింగ్ కేంద్రం వద్దపర్యవేక్షిస్తున్న డీఎస్పీ బాలాజీ
● పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు.. ● జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం నమోదు ● ఉత్సాహంగా ఓటేసిన యువకులు ● ఉదయం నుంచే బారులు.. ● పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు.. ● ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : బారులు తీరిన ఓటర్లు.. ఉత్సాహంగా ఓటేసిన యువ ఓటర్లు.. తరలివచ్చిన వృద్ధులు, దివ్యాంగులు.. ఓటుహక్కును వినియో గించుకున్న ప్రముఖులు.. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపులు.. పలుచోట్ల కార్యకర్తల మధ్య ఘర్షణలతో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 13.93 లక్షల మంది ఓటర్లు ఉండగా, అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం ఏడు గంటలలోపే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్ 11 గంటల తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అందోల్‌లో అత్యధికంగా 84.76 శాతం నమోదు కాగా, అత్యల్పంగా పటాన్‌చెరులో 69.80 శాతం నమోదు అయ్యింది.
ఓట్లు గల్లంతు..
పలు నియోజకవర్గాల్లో ఓట్లు గల్లంతయ్యాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలో పలుచోట్ల తమ ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల్లో కొందరు ఓట్లు ఉంచి, మరికొందరి ఓట్లు తొలగించారని రామచంద్రాపురంలో ఓటర్లు వాపోయారు. నివాసం ఉండే ప్రాంతాలకు దూరంగా పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో ఓటర్లు కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డారు.
మొరాయించిన ఈవీఎంలు
జిల్లాలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ మధ్యలో కూడా ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ పోలింగ్ కేంద్రం, నారాయణఖేడ్‌లోని జుకల్, హంగుర్గాలో, పటాన్‌చెరులోని జేపీనగర్, అమీన్‌పూర్‌లలో, పుల్కల్ మండలం కోడూర్‌లో, కంగ్టి మండలం బాన్సువాడ (డీ) కేంద్రంలో, అందోల్ మండలం తాలెల్మలో, ఝరాసంగం మండలం పొట్‌పల్లిలో ఈవీఎం మొరాయించాయి. నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్‌పేట్‌లోని 179 బూత్‌లో వెలుతురు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
పలుచోట్ల స్వల్ప ఘర్షణలు..
పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. సదాశివపేట్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం చిట్కుల్ వద్ద బీఎస్పీ, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఓ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని మరో పార్టీ నేతలు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.