చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● ఆ సమయంలో 30 మంది ప్రయాణికులు ● 23 మందికి గాయాలు,అందులో ఏడుగురికి తీవ్ర గాయాలు ● ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ● రాళ్లకత్వ గ్రామంలో ఘటన ● అతి వేగమే ప్రమాదానికి కారణమా?
బస్సు వేగంగా వెళ్తుంది
బస్సు రోజూ వేగంగా వెళ్తోంది. ఈ విషయాన్ని చాలాసార్లు ఆర్టీసీ అధికారులకు చెప్పాం. అయినా పట్టించుకోలేదు. వేగంగా బస్సు వెళ్తుండటాన్ని కళ్లారా చూశా. గ్రామాల నుంచి వెళ్తున్న సమయంలో డ్రైవర్లు వేగాన్ని తగ్గించాలి.
: మల్లేశ్, ప్రత్యక్ష సాక్షి, రాళ్లకత్వ
జిన్నారం(పటాన్‌చెరు): అతివేగానికి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. అందులో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇక్కడి నుంచి ఉదయం 7 గంటలకు 30 మంది ప్రయాణికులతో పటాన్‌చెరుకు బయలుదేరింది. రాళ్లకత్వ దాటిన తర్వాత వచ్చిన ఒక మలుపు వద్ద బస్సు వేగానికి అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. అందులో డ్రైవర్ ఎరుకలి బుచ్చయ్య, కండక్టర్ పోచయ్య, ఇమాంనగర్‌కు చెందిన చిద్రుప్ప పద్మ, సోలక్‌పల్లికి చెందిన ఇంద్రేశం అక్షిత్‌గౌడ్, నల్లగండ్ల సాయి, నల్లగండ్ల సంజన, సికింద్రాబాద్‌కు చెందిన రాజమన్నోళ్ల లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొంత మందిని ఇంద్రేశంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విజయారావు తెలిపారు. క్షతగాత్రులను డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ వేణుకుమార్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం దైవాదీనం, డిపో మేనేజర్ మాధవి, పలువురు రాజకీయ పార్టీల నేతలు పరామర్శించారు.
స్టీరింగ్ నట్టు ఊడిపోయింది
స్టీరింగ్ నట్టు ఊడిపోవటంతో బస్సు కంట్రోల్ కాలేదు. దీంతో చెట్టుకు ఢీకొంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నా అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తా.
: బుచ్చయ్య, డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment