
చేపలు పట్టేందుకు వెళ్లి..
మునిపల్లి(అందోల్): సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం అందోల్ మండల పరిధిలో చోటు చేసుకుంది. బుదేరా ఎస్‌ఐ రాజేశ్ నాయక్ కథనం ప్రకారం... మండల పరిధిలోని చిన్న చల్మెడ గ్రామానికి చెందిన దుదేకుల అనిరోద్దీన్, తక్కడపల్లి గ్రామానికి చెందిన సద్దాం అహ్మద్ కలిసి సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చేపలు పట్టడానికి విద్యుత్ యంత్రాలతో వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో దుదేకుల అనిరోద్ధిన్(30) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసై
వ్యక్తి మృతి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి):
మద్యానికి బానిసై అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని సూరారం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం పక్రారం... మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన హాకీమ్ పోశెట్టి(52) భిక్షాటన చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. అనారోగ్యానికి గురి కావడంతో అతడి అన్న రాములు ఈనెల 8న ఆసుపత్రిలో వైద్యం చేయించి సదాశివపేట పట్టణంలోని దర్గా దగ్గర వదిలి వెళ్లాడు. సూరారం గ్రామ శివారులోని ఓ మామిడి తోట వద్ద వ్యక్తి చనిపోయి ఉన్నాడని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మృతుడి అన్న రాములు ఘటనా స్థలానికి వెళ్లి చూశాడు. అనారోగ్యం కారణంగా, ఆహారం లేక, వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి అన్న రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
కోనాయిపల్లిలో
బంగారం, నగదు చోరీ
కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నుంచి బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లిన ఘటన కుకునూరుపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కోనాయిపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ కుటుంబీకులతో కలిసి యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న కొడువటూర్ గుట్ట దేవాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి తులంన్నర బంగారు నగలు, రూ. 20వేలను ఎత్తుకెళ్లారు. దర్శనం ముగించుకొని ఇంటికి వచ్చాక నగలు అపహరణకు గురైన విషయాన్ని గమనించి జహంగీర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.