అనారోగ్య సమస్యలతో విద్యార్థి
బెజ్జంకి(సిద్దిపేట): అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని నర్సింహులపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ క్రిష్ణారెడ్డి కథనం మేరకు.. నర్సింహులపల్లె గ్రామానికి చెందిన కుసుంబ రవి పద్మలకు ఇద్దరు కుమారులు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. పెద్ద కుమారుడు సాయి(22) కరీంనగర్‌లోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నాలుగేళ్లుగా దగ్గు, దమ్ము, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చూయించుకున్నా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెంది వ్యవసాయం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సాయిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆకారం గ్రామంలో రైతు
దుబ్బాకరూరల్: అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజ్ కథనం మేరకు.. దుద్దెడ లక్ష్మయ్య(52)గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆరు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల పెద్ద ప్రేగుకు శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై తెల్లవారు జామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉరేసుకొని వ్యక్తి..
చిలప్‌చెడ్(నర్సాపూర్): అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలప్‌చెడ్ మండలం చండూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. చండూర్ గ్రామానికి చెందిన దూదేకుల ఇమామ్ (38) హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల కిందట కట్టిన ఇంటి నిర్మాణానికి అప్పులు కావడంతో మనస్తాపం చెందిన ఇమామ్ 15న హాపీజ్‌పేట్ నుంచి చండూర్ గ్రామానికి వచ్చాడు. 16న ఉదయం భార్య ఫాతిమాబేగం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బావ అయిన షాదుల్లాకు విషయం చెప్పింది. అతడు వెళ్లి చూసేసరికి ఇంట్లో ఇమామ్ ఉరేసుకొని కనిపించాడు. మృతుడి భార్య ఫాతిమా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అదనపు కట్నం వేధింపులకు వివాహిత
కంగ్టి(నారాయణఖేడ్): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంగ్టి మండలం భీంరా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నాగన్‌పల్లి గ్రామానికి చెందిన పోగుల రవీందర్ రెడ్డి, సుజాత రెండవ కుమార్తె మహేశ్వరి(22)కి భీంరా గ్రామానికి చెందిన బోండ్ల పండరిరెడ్డితో 2022లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అత్తారింట్లో భర్త, మామ, బావ అదనపు కట్నం తేవాలని మహేశ్వరిని వేధించ సాగారు. ఈ విషయంలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సముదాయించారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో సోమవారం తెల్లవారు జామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి రవీందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు భర్త బోండ్ల పండిరిరెడ్డి, బావ బసిరెడ్డి, మామ గంగారెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
చెరువులో దూకి యువకుడు
కంది(సంగారెడ్డి): చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంది మండలంలోని చిమ్నాపూర్ తండా లో చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌సై రవీందర్ కథనం మేరకు.. చిమ్నాపూర్ తండాకు చెందిన భానోత్ అంబర్ సింగ్(25) ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తండాకు సమీపంలో ఉన్న ధర్మసాగర్ చెరువుకట్టపై అంబర్ సింగ్ చెప్పులు ఉన్నట్లు తండా వాసులు గుర్తించారు. పోలీసుల సహకారంతో చెరువులో ఆచూకీ కోసం గాలించగా అంబర్ సింగ్ మృతదేహం లభించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో ఇద్దరు రైతులు
రామాయంపేట(మెదక్): ఆర్థిక సమస్యలతో మండల పరిధిలోని ప్రగతి ధర్మారంలో ఒకరు, ఆర్. వెంకటాపూర్ గ్రామంలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్‌ఐ బాల్ రాజ్ కథనం మేరకు.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన రైతు మాసాయిపేట పురుషోత్తం (34) కొంతకాలంగా అప్పుల బాధతో సతమతమవుతున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం పొలానికి నీరు పెట్టి వస్తానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బోరు వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. అప్పుల బాధతోనే భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య భాగ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు పుర్ర రాములు (36) ఆర్థిక సమస్యలతో రెండు రోజుల కిందట ఇంటిలోనే క్రిమి సంహారక మందు తాగాడు. అతడిని చికిత్స నిమిత్తం రామాయంపేట నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేర్వేరు చోట్ల ఏడుగురు బలవన్మరణం
వేర్వేరు చోట్ల ఏడుగురు బలవన్మరణం
వేర్వేరు చోట్ల ఏడుగురు బలవన్మరణం
వేర్వేరు చోట్ల ఏడుగురు బలవన్మరణం