కలప మిల్లులో షార్ట్ సర్క్యూట్
జహీరాబాద్ టౌన్: ఓ కలప మిల్లులో అగ్ని ప్రమా దం జరిగిన ఘటన జహీరాబాద్ పట్టణంలోని రాచన్నపేటలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాచన్నపేటలో గల గురుకృష సామిల్(కలప మిల్లు)లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. తొలుత సామిల్‌కు మంటలు అంటుకొని ముందున్న మారుతీ కార్పెంట్ షాపునకు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న స్థానికులు మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వచ్చి మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో కలపతోపాటు కార్పెంట్ దుకాణంలో ఉన్న మిషన్‌లు, బైక్ దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జహీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వంటగదిలో మంటలు
వెల్దుర్తి(తూప్రాన్) : అగ్ని ప్రమాదంలో వంటగది దగ్ధమైన ఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మర్కంటి రుక్కమ్మకు చెందిన వంటగది ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలి బూడిదయ్యింది. ప్రమాదంలో వంట సామగ్రి, బట్టలు, ఇతర నిత్యావసర సరుకులు కాలిపోయాయి. ఘటనా స్థలాన్ని గిర్దావర్ నర్సింగ్ యాదవ్ సందర్శించి పంచనామా నిర్వహించారు.అగ్నిప్రమాదంలో సుమారు రూ.25 వేల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
కాలిబూడిదైన గడ్డివాము
శివ్వంపేట(నర్సాపూర్) : గడ్డివాము దగ్ధమైన ఘట న మండల పరిధి ఎదుల్లాపూర్ గ్రామంలో సోమ వారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బురెడ్డి అంజిరెడ్డి వ్యవసాయం పొలం వద్ద నిల్వ ఉంచిన ఎండు గడ్డివాముకు నిప్పంటుకుంది. సుమారు 800 గడ్డి మోపులు దగ్ధమయ్యాయి. నర్సాపూర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పినప్పటికీ పూర్తిగా తగులబడిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టినట్లు బాధిత రైతు అంజిరెడ్డి వాపోయారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని కోరారు.
ఒక్క రోజే నాలుగు ఘటనలు
భారీస్థాయిలో ఆస్తి నష్టం
లబోదిబోమంటున్న బాధితులు
చెరకు తోట, డ్రిప్ పైపులు దగ్ధం
జహీరాబాద్ టౌన్: అగ్నిప్రమాదంలో చెరకు తోటతోపాటు డ్రిప్ పైపులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రమైన మొగుడంపల్లి గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని భవానమ్మపల్లికి చెందిన రైతు గొల్ల రాచన్నకు మొగుడంపల్లి వద్ద 11 ఎకరాల చెరకు తోట ఉంది. పంటను ఇటీవలె కర్మాగారానికి సరఫరా చేయగా ప్రస్తుతం మొడెం తోట(రెండవ పంట) ఉంది. రోడ్డు పక్కన తోట ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు సిగరేట్ తాగి పారవేయడంతో తోటకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో తోటతోపాటు డ్రిప్ పైపులు కాలిపోయాయి. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.
అగ్ని ప్రమాదాలు.. కష్టం బూడిద పాలు
అగ్ని ప్రమాదాలు.. కష్టం బూడిద పాలు