
పన్ను వసూళ్లు 86శాతం పూర్తి
న్యాల్‌కల్ (జహీరాబాద్): జిల్లాలో ఇంటి పన్నుతోపాటు ఇతర పన్నులు వసూలు చేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నెలాఖారు వరకు వంద శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. గతంలో వసూలు చేసిన మాదిరిగా పన్నులను నిర్ణీత సమయానికంటే ముందే పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పన్నులు వసూలు చేసేందుకు ఇంటి బాట పట్టారు. ఈ నెలాఖరు వరకు వందశాతం పన్నులు తప్పకుండా వసూలు చేసేందుకు కార్యదర్శులు ఇళ్లన్నీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 27మండలాలు, 633 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.23,54,92,355 పన్నులు వసూలు చేయవలసి ఉండగా ఇప్పటివరకు జిల్లాలో రూ.20,45,71,746 (86.87%) పన్నులు వసూలు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 27 మండలాలు ఉండగా అందులో ఏ ఒక్క మండలంలో కూడా వంద శాతం పన్నులు వసూలు కాలేదు. అందోల్, మనూర్, నాగిల్‌గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, అత్నూర, పటాన్‌చెరువు, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, జహీరాబాద్ మండలాల్లో 90 శాతానికి పైగా పన్నులు వసూలు అయ్యాయి. వట్‌పల్లి, అమీన్‌పూర్, జిన్నారం, సంగారెడ్డి మండలాల్లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా వంద శాతం పన్నులు వసూలు చేయలేదు. జిల్లాలో 99.62% పన్నులు వసూలు చేసిన నాగిల్‌గిద్ద మండలం మొదటి స్థానంలో ఉండగా, 65.56% పన్నులు వసూలు చేసిన కంగ్టి మండలం చివరి స్థానంలో నిలిచింది.
గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ
వసూలు చేసిన పన్నులను పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రజలంతా ఇంటి పన్నుతోపాటు ఇతర పన్నులు తప్పకుండా కట్టాలని, పన్నులు కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేస్తున్నారు. ఇళ్లన్నీ తిరిగి వసూలు చేసిన సొమ్మును ఎప్పటికప్పుడు బ్యాంక్‌ల ద్వారా పంచాయతీల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. వసూలు చేసిన పన్నులతో ఆయా గ్రామాల్లో మంచి నీటి ట్యాంక్‌లు, మురికి కాల్వలను శుభ్రం చేయించడం, పగిలిన పైప్‌లైన్‌లకు, లీకేజీల మరమ్మతులు చేయించడం, వీధి దీపాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వాటిని వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పన్నుల వసూలుకు ఇంకా 13 రోజుల సమయం మాత్రమే మిలిగి ఉంది. ఈలోగా పన్నులు వంద శాతం వసూలు అవుతాయా? లేదా వేచి చూడవలసిందే.
జిల్లాలో 633 పంచాయతీలు
287 జీపీల్లో పూర్తయిన
పన్ను వసూళ్ల ప్రక్రియ
నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని లక్ష్యం