పీఎం శ్రీతోపాటు మొబైల్ అంగన్‌వాడీ సెంటర్లను రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి
సిద్దిపేటరూరల్: ఐసీడీఎస్‌లను రద్దు చేయాలని తెచ్చిన పీఎం శ్రీపథకంతోపాటు మొబైల్ అంగన్‌వాడీ సెంటర్లను రద్దు చేయా లని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మినీ టీచర్లు పెద్ద ఎత్తున సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ.. దేశంతోపాటు రాష్ట్రంలో ఐసీడీఎస్ ప్రారంభమై 50 ఏళ్లు అవుతుందన్నారు. ఐసీడీఎస్‌ను, సేవలను సంస్థాగతం చేయాలని, ఇందులో పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్స్, ఆయాలను, మినీ టీచర్లను పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు ఆదేశాలిచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను అమలు చేయాలని చూడటం అన్యాయమన్నారు. మొబైల్ అంగన్ వాడీ సేవల పేరుతో కొత్త విధానాన్ని తెచ్చి ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయొద్దన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా కోశాధికారి జీ.భాస్కర్, సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీ, పద్మ, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.