
పట్టణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రూ.4,500 కోట్లు కేటాయించింది. జిల్లాలో కొత్తగా మూడు మున్సిపాలిటీలు ఏర్పడిన విషయం విదితమే. చుట్టు పక్కల గ్రామాలను విలీనం చేస్తూ ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదలను మున్సిపాలిటీలుగా చేసింది. అలాగే కొహీర్‌ను కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ కొత్త మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కలిసొచ్చే అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సంగారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడ)ను కూడా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయినప్పటికీ.. దాని ఫంక్షనింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ సంస్థ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఊసేలేని సంగమేశ్వర, బసవేశ్వరలు
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ఊసు బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. కానీ పనులు ప్రారంభ దశలోనే ఉండి పోయాయి. ఈసారి కేటాయింపులో ఈ రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు కేటాయింపులు లేవు.
ఆరు గ్యారెంటీలతో..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రూ.56 వేల కోట్లు కేటాయించింది. ఈ భారీ కేటాయింపులతో ఆయా పథకాల లబ్ధిదారులకు మేలు జరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహాలక్ష్మి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు 1.73 లక్షల మంది ఉన్నారు. అలాగే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి లబ్ధిదారులు 2.16 లక్షల మంది ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇప్పటి వరకు 1.82 మంది మహిళలు ఉపయోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సూత్రప్రాయంగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 2,170 మందికి మొదటి ఆరు నెలలకు రూ.ఆరు వేల చొప్పున చెల్లించారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు రూ.56 వేల కోట్లు కేటాయింపులతో ఈ పథకాల లబ్ధి కొనసాగనుంది.
ఉమ్మడి జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లో రూ.14.62 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో కేటాయింపులు రూ.44.85 కోట్లకు పెరిగింది. సింగూరు కాల్వల ఆధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టిన విషయం విదితమే. ప్రధాన కాల్వతో పాటు, డిస్ట్రిబ్యూటరీల సిమెంట్ లైనింగ్ పనులకు రూ.143 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులు ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే సుమారు రూ.29 కోట్లు కేటాయింపులు పెరగాయని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సింగూరు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా ఇచ్చే కేటాయింపుల్లో మాత్రం కోత పడింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.37 కోట్లు కేటాయించగా, ఈసారి ఈ నిధులు కేవలం రూ.పది లక్షలతో సరిపెట్టింది. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుకు కూడా కేటాయింపులు తగ్గాయి. గత ఏడాది రూ.9.01 కోట్లు ఉండగా, ఈసారి రూ.5.05 కోట్లకు కేటాయింపులు తగ్గడం గమనార్హం.
కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.4,500 కోట్లు
బల్దియాలుగా మారిన కొహీర్, ఇస్నాపూర్, గుమ్మడిదల, గడ్డపోతారం
సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన కేటాయింపులు
ఊసేలేని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు
నల్లవాగుకు తగ్గిన కేటాయింపులు