● మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: డీఎంహెచ్‌ఓ
● నేరడిగుంట పీహెచ్‌సీ తాత్కాలిక భవనం ప్రారంభం
వట్‌పల్లి(అందోల్): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గాయత్రిదేవి అన్నారు. బుధవారం అందోలు మండలం నేరడిగుంటలో పీహెచ్‌సీ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో 30 వేలు, గిరిజన ప్రాంతాల్లో 20వేల జనాభా ప్రాతిపదికన పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలన్న నిబంధనల మేరకు జిల్లాలో కంకోల్, సింగీతం, బర్దిపూర్, నేరడిగుంట, సుల్తాన్‌పూర్ గ్రామాల్లో నూతనంగా ఐదు పిహెచ్‌సీలు మంజూరయ్యాయని తెలిపారు. నేరడిగుంట పీహెచ్‌సీ ఫరిదిలో 40వేల మంది జనాభ ఉందని, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి 11 సబ్‌సెంటర్‌లు, 25 గ్రామాలు వస్తాయన్నారు. నేరడిగుంట ఆసుపత్రికి వైద్యాధికారిగా డాక్టర్ శంకర్‌తో పాటు సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించామని పేర్కొన్నారు. పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.46 కోట్లు కేటాయించిందని, అయితే.. కేటాయించిన స్థలం సరిపోదని మరో 20 గుంటలు అవసరమన్నారు. స్థలాన్ని కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బి.శివరాజ్, ఎంపీఓ సోంనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, పాల్గొన్నారు.