● రైతుల నుంచి పాలు కొనుగోలు చేయని హాట్సన్ కంపెనీ ● తక్కువ ధర ఇస్తున్న విజయ డెయిరీ ● గిట్టుబాటుకాక పాడి రైతుల ఆందోళన ● భారంగా మారిన పశుపోషణ ● నేడు జహీరాబాద్‌లో ధర్నా
జహీరాబాద్ టౌన్: వ్యవసాయ రంగమే కాదు.. పా డి రైతులు కూడా నష్టాలు పాలవుతున్నారు. పశుపోషణ మోయలేని భారంగా తయారవుతుంది. పాలకు గిట్టుబాటు ధర రాక అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు చేయూత అందించడం లేదు. స్థానికంగా ఉన్న హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ కంపెనీ వారు పాలను తీసుకోవడం లేదు. విజయ డెయిరీ పాలలో నాణ్యత లోపం చూపుతున్నారు. వేల రూపాయ లు పెట్టుబడి పెట్టి పాలు ఉత్పత్తి చేస్తూ నష్టపోతున్నామని పాడి రైతులు వాపోతున్నారు. న్యాయం చేయాలన్న డిమాండ్‌లతో జహీరాబాద్ ప్రాంతంలోని పోరాటం చేయాలని నిర్ణయించారు.
నాణ్యత పేరుతో తక్కువ ధర
జహీరాబాద్ ప్రాంతంలో సుమారు వంద వరకు డెయిరీ ఫామ్‌లు ఉన్నాయి. పాలు సేకరిస్తున్న డెయిరీలు, ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ, హాట్సన్ ఆగ్రో కంపెనీపై పాడి రైతులు ఆధారపడ్డారు. కానీ హాట్సన్ కంపెనీ వారు జహీరాబాద్ రైతుల నుంచి లీటర్ పాలను కూడా కొనడం లేదు. విజయ డెయిరీ నాణ్యత పేరుతో తక్కువ ధర చెల్లిస్తుంది. ప్రైవేట్ డెయిరీల నిర్వాహకులు తక్కువ ధరకే పాలను కొంటున్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. పశువుల ధరలు, పశుగ్రాసం సాగు, దాణా, గేదెల పోషణ, వైద్యం ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలు అమ్మినా గిట్టుబాటుకాక ఆందోళన చెందుతున్నారు. పోషణ భారం మోయలేక పశువులను విక్రయిస్తున్నారు.
నేడు పట్టణంలో ధర్నా
పలు కారణాలతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు (గురువారం) పట్టణంలో ధర్నా చేపడుతున్నట్లు పాడి రైతు విష్ణు తెలిపారు. జహీరాబాద్ సమీపంలోని హాట్సన్ ఆగ్రో కంపెనీ వారు నిబంధనలు పాటించడంలేదని, డెయిరీలు పాలను సేకరించడంలేదన్నారు. హాట్సన్ కంపెనీకి మహారాష్ట్ర, కర్నాటక నుంచి లక్ష లీటర్ వరకు పాలు వస్తున్నాయన్నారు. కానీ స్థానిక పాడి రైతుల నుంచి కొనుగోలు చేయడంలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు.
నష్టాలపాలు