● ఇసుక సంచులు, బాట్లు వేసి ఖాళీ వాహనాన్ని తూకం ● రైతుల అప్రమత్తతతో వెలుగులోకి..
వట్‌పల్లి(అందోల్): రైతులనే బోల్తా కొట్టించబోయిన ఓ దొంగ వ్యాపారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మండల పరిధిలోని దరఖాస్తుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. రైతుల కథనం మేరకు.. వట్‌పల్లికి చెందిన అసన్ అనే ఓ వ్యాపారి దరఖాస్తుపల్లి గ్రామంలో పత్తిని తూకం వేసేందుకు వచ్చాడు. ముందుగా తన ఖాళీ వాహనాన్ని తూకం వేసే సమయంలో రెండు ఇసుక సంచులతోపాటు ఆరు బాట్లను వాహనంలోనే ఉంచి తూకం వేశాడు. దరఖాస్తుపల్లి గ్రామంలో పత్తి తూకం వేసే సమయంలో వాహనంలో ఇసుక బస్తాలను చూసి అవాక్కయ్యారు. వాహనంలో ఇసుక బస్తాలు, బాట్లు వేసి తూకం వేశావని నిలదీశారు. సుమారుగా 4 క్వింటాళ్ల వరకు ఉన్న వాటితో అంతే మొత్తంలో పత్తిని నష్టపోయేవారమని వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వట్‌పల్లి పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. దీంతో మరికొందరు రైతులు ఇదివరకు ఇదే వ్యాపారికి మమ్మల్ని ఇలానే మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వాహనంతోపాటు ఇసుక బస్తాలు, తూకపు బాట్లను స్టేషన్‌కు తరలించారు. దీంతో వ్యాపారి దిగొచ్చి తన మోసాన్ని ఒప్పుకొని ఓ రైతుకు రూ. 50 వేలు చెల్లించడంతోపాటు మిగితా రైతులకు క్షమాణలు చెప్పడంతో పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.