వైద్యం జాడలేదు | - | Sakshi
Sakshi News home page

వైద్యం జాడలేదు

Published Sat, Mar 22 2025 9:12 AM | Last Updated on Sat, Mar 22 2025 9:11 AM

నిలువ నీడ లేదు..
ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కానరాని వసతులు

వడదెబ్బతో మహిళా కూలీ మృతి

నారాయణఖేడ్‌: వడదెబ్బతో ఉపాధి హామీ మహిళా కూలీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఖేడ్‌ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. తోటి కూలీల కథనం మేరకు.. ఖేడ్‌ మండలం ర్యాకల్‌ గ్రామ శివారులో ఉపాధి హామీ కింద కొద్ది రోజులుగా కాల్వ తవ్వకం పనులు జరుగుతున్నాయి. రోజూలాగే శుక్రవారం గ్రామానికి చెందిన బోయిని లచ్చవ్వ (52) పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న క్రమంలో అస్వస్థతకు గురై స్పృహతప్పి కిందపడిపోయింది. తోటి కూలీలు ఖేడ్‌ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త బోయిని భూమయ్య రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

గ్రామాల్లో వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించాలన్నది ఉపాధి హామీ లక్ష్యం. ఈ క్రమంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ప్రతీ ఏటా గ్రామాల్లో ఉపాధి పనులు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో విస్తృతంగా పనులు కల్పిస్తున్నప్పటికీ అదే రీతిలో తగిన వసతులు కల్పించడం లేదు. ఉపాధి కూలీలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు టెంట్లు, తాగునీటి వసతి, అత్యవసర సమయాలకు ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ సదుపాయాలు జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు.

– సంగారెడ్డి జోన్‌/నారాయణఖేడ్‌

ఉపాధి హామీ పథకంలో పనులు చేసే వారికి పదేళ్ల క్రితం పనిముట్లు, టెంట్లు పంపిణీ చేశారు. గ్రూపులో ఉన్న నలుగురు సభ్యులకు కలిపి నాలుగు గుంతలు తవ్వేందుకు గడ్డపారలను అందించారు. అప్పటినుంచీ ఇప్పటివరకు తిరిగి ఎలాంటి పనిముట్లు అందించలేదు. దీంతో కూలీలే తాము కొనుగోలు సొంత పనిముట్లు తీసుకువచ్చి పనులు ముగిస్తున్నారు. పనిముట్లకు సంబంధించి ఎలాంటి భత్యం చెల్లించడం లేదని తెలుపుతున్నారు.

కనిపించని మెడికల్‌ కిట్లు

పనులు చేసే సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించేందుకుగాను మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ, ఎక్కడ చూసినా పని ప్రదేశాల్లో మెడికల్‌ కిట్లు కనిపించడం లేదు. పలుమార్లు ఉపాధి కూలీలకు గాయాలైతే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అదేవిధంగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం లేదని కూలీలు తెలిపారు.

గొలుసుటెంట్లు లేక.. చెట్ల కింద సేద

రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రతీ ఒక్కరు జంకుతున్నారు. ప్రతీరోజు ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు పనులు చేస్తున్నారు. పనులు ముగిసిన తర్వాత ఆన్‌లైన్‌ విధానంలో కూలీల హాజరు వేస్తుంటారు. ఆ సమయంలో పనులు చేసిన పరిసరాల్లో చెట్లు ఉంటే సేద తీరుతున్నారు.

వేడిగా తాగునీరు

వేసవిలో ఎక్కువగా నీరు తాగాలని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. పనులకు వెళ్లిన సమయంలో కూలీలు తమ ఇంటి నుంచి నీటిని బాటిళ్లలో తీసుకు వెళ్తున్నారు. పెరుగుతున్న ఎండలకు ఇంటి నుంచి తీసుకువెళ్లిన తాగునీరు పూర్తిగా వేడిగా మారుతున్నాయని తాగలేకపోతున్నామని ఉపాధి హామీ కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న కూలీల సంఖ్య

ఉపాధి హామీ పథకంలో రోజురోజుకీ కూలీల సంఖ్య పెరుగుతుంది. జాబ్‌ కార్డు కలిగి ఉండి అర్హులైన ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తున్నారు. దీంతో ఉపాధి పనులపై ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో 1,32,000 మందికి జాబ్‌ కార్డులు ఉండగా రెండు లక్షల 25 వేల మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 35 వేలకు పైగా మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. కానీ, కూలీలకు వసతులు కల్పి ంచడంలో అధికారులు విఫలం అవుతున్నారు.

జిల్లాలో యాక్టీవ్‌ జాబ్‌ కార్డులు 1,32,000

రోజూ హాజరయ్యే కూలీలు 35,000లకు పైగా

ఏళ్లుగా అందని పరికరాలు

అత్యవసర మెడికల్‌ కిట్లు, టెంట్లు కరువు

గాయాలైతే ఆరోగ్య కేంద్రానికి పరుగులు

చెట్ల కిందే సేద తీరుతున్న కూలీలు

తాగు నీటి వసతి అంతంతే

వడదెబ్బకు నారాయణఖేడ్‌ మండలం ర్యాకల్‌లో ఒకరు మృతి

నాలుగేళ్లుగా అదనపు భత్యం బంద్‌

ఉపాధి కూలీలు వేసవిలో చేసే పని ప్రదేశాల్లో భూమి వేడిమి వల్ల గట్టిగా ఉండడం, పొద్ద స్తమానం పని చేయలేని పరిస్థితి ఉండటంతో అదనపు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మార్చిలో 20 శాతం, ఏప్రిల్‌లో 25 శాతం, మేలో 30 శాతం అదనపు కూలి చెల్లించేవారు. కానీ నాలుగేళ్లుగా ఈ అదనపు కూలి చెల్లించడం లేదు. గతంలో రాగాస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నమోదు చేసే సందర్భాల్లో అదనపు చెల్లింపులు నమోదుకు అవకాశం ఉండే. ప్రస్తుతం ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌) సాఫ్ట్‌వేర్‌ వాడుతుండడం, కేంద్రం నేరుగా ఈ సాఫ్ట్‌వేర్‌ రూపొందించి వినియోగిస్తుండడంతో అదనపు కూలి చెల్లింపుల నమోదుకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో డైవర్షన్‌ డ్రైన్‌, రాకళ్ల కట్టలు, ఫీడర్‌ ఛానెల్‌, ఎంఐ ట్యాంక్‌, పశువులు, గొర్ల షెడ్లు, కోళ్ల ఫారాల నిర్మాణం, చెక్‌డ్యాం, ఫామ్‌ ఫండ్‌, ఫార్మేషన్‌ రోడ్డు పనులు సాగుతున్నాయి. ఈ పనులన్నీ దాదాపు ఎండపట్టునే చేయాల్సి ఉటుంది.

వైద్యం జాడలేదు1
1/3

వైద్యం జాడలేదు

వైద్యం జాడలేదు2
2/3

వైద్యం జాడలేదు

వైద్యం జాడలేదు3
3/3

వైద్యం జాడలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement