వర్గల్(గజ్వేల్): చేసిన అప్పు లు భారమై, మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు.. వర్గల్‌కు చెందిన కిస్టనోళ్ల నర్సింలు(58) హమాలీ. భార్య అండాలు, కూతురు, కుమారుడు ఉన్నారు. రూ.10 లక్షల వరకు అప్పు చేసి ఏడాదిన్నర కిందట కూతురి వివాహం చేశాడు. కాలికి గాయం కావడంతో నాలుగు నెలల నుంచి ఏ పని చేయకుండా ఇంటి వద్దే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన భర్తను రోజు తాగి వస్తే అప్పు ఎలా తీరుతుందని భార్య మందలించింది. దీంతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కౌలుకు తీసుకున్న పొలంలో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి..
శివ్వంపేట (నర్సాపూర్): ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధి గూడూరు గ్రామానికి చెందిన బోయిని మల్లేశ్ యాదవ్ (45) ఆర్థిక ఇబ్బందులతోపాటు మద్యానికి బానిసయ్యాడు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం
అప్పులు భారమై.. మద్యానికి బానిసై