
బియ్యం పక్కదారిపై విచారణ
నారాయణఖేడ్: ‘పేదల బియ్యం పక్కదారి’శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు రహస్యంగా విచారణ నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఈ బియ్యం దాబావద్ద పట్టుబడినట్లు నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి మీడియాకు తెలిపారు. భవిష్యత్తులో బియ్యం పట్టుబడితే తూకం వేసే క్రమంలో పోలీసు కానిస్టేబుల్‌ను తూకంవేసే వరకు ఉండి పరిశీలించి తగు ఫొటోలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.
పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్
సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సబితా ప్రతిభావంతుల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పిల్లలకు కావాల్సిన సదుపాయాలను కల్పించాలన్నారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆశ వర్కర్లకు జీతం పెంచాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు
పటాన్‌చెరు: ఆశ వర్కర్లకు నెలకు రూ.18 వేల జీతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ సందర్భంగా ఆశ వర్కర్లపై పోలీసుల దౌర్జన్యాలను, వారి అక్రమ అరెస్టులను ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. ఆశ వర్కర్ల అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలలో విజయవంతం కోసం అనేక ఏళ్లుగా ఆశ వర్కర్లు ప్రజలకు సేవలందిస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
27న నిధి ఆప్ కే నిఖత్
పటాన్‌చెరుటౌన్: భవిష్య నిధి సంస్థ ద్వారా సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ నెల 27న నిధి ఆప్ కే నిఖత్ 2.0 నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ విశాల్ అగర్వాల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు కేంద్రాల్లో శిబిరాలను ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని వెలజాన్ హైడ్రాయిర్ లిమిటెడ్‌లో, జహీరాబాద్ కోహీర్ క్రాస్ రోడ్‌లో పిరమల్ ఫార్మా లిమిటెడ్‌లో, పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సింతోకెం లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో భవిష్యనిధి సమస్యలున్న వారు ఈ మూడు కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఉపాధిపై ప్రజా వేదిక
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 2023–24 ఏడాదికి గాను 15 గ్రామాలలో రూ.85 లక్షలు ఖర్చు చేసిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ కార్యక్రమానికి జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి బాలరాజ్ ప్రిసైడింగ్ అధికారిగా హాజరయ్యారు. 15 గ్రామాలలో జరిగిన ఉపాధి హామీ పనులను తనిఖీలు చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి నాగేశ్వర్‌రావు, అంబుడ్స్‌మన్ భోజిరెడ్డి, ఎంపీడీవో అరుణారెడ్డి, ఏపీవో రామ్మోహన్, ఈసీ మహేశ్వర్‌రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

బియ్యం పక్కదారిపై విచారణ