
ఆదాయంపై శ్రద్ధ.. సమస్యలపై అశ్రద్ధ
తెల్లాపూర్ మున్సిపాలిటీ
● అస్తవ్యస్తంగా పాలన.. రోడ్లపై చెత్త కుప్పలు ● సమస్యలను పట్టించుకోని అధికారులు ● జోరుగా అక్రమ నిర్మాణాలు
చెరువులోకి మురుగునీరు
కొన్నేళ్లుగా శేరిలింగంపల్లి నలగండ్ల ప్రాంతాలకు చెందిన మురుగునీరు చెరువులోకి చేరుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు పూర్తి కాలుష్యమవుతున్నాయి.
తెల్లాపూర్ మున్సిపల్ వివరాలు
తెల్లాపూర్ మున్సిపల్ ఏర్పాటు 2018
పట్టణంలోని వార్డులు 17
జనాభా 11,742 (2011 ప్రకారం)
ప్రస్తుతం 2 లక్షలపైగా
రెవెన్యూ జోన్‌లు 5
ఇళ్ల సంఖ్య 42,298
అవసరమైన తాగునీరు 11 ఎంఎల్‌డీ
చెత్త సేకరణ వాహనాలు 27
పబ్లిక్ టాయిలెట్స్ 5
విద్యుత్ దీపాలు 4,24,621
మహిళా గ్రూపులు 379
పారిశుద్ధ్య కార్మికులు 150
రామచంద్రాపురం(పటాన్‌చెరు): మున్సిపల్ పాలక వర్గం పదవీకాలం పూర్తికావడంతో ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపాలిటీకి ఆదాయ వనరులను సమకూర్చడంపైనే అధికారులు దృష్టి పెడుతున్నారు తప్ప అందులో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. రహదారులపైనే చెత్తకుప్పలు, డ్రైనేజీ నీరు పూడికతీత లేక పొంగిపొర్లుతుండటం, పలు కాలనీలకు చెందిన మురుగునీరు చెరువులోకి చేరుతుడటం వంటి సమస్యలు ప్రజల్ని వేధిస్తున్నా అధికారులకు కంటికి మాత్రం కనిపించడం లేదు.
రోడ్లపై చెత్త కుప్పలు
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రేడియల్ రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు వార్డులలో సైతం రోడ్లపై చెత్త వేసి తగలబెడుతున్నారు. విద్యుత్‌నగర్ నుంచి తెల్లాపూర్ మార్గంలో, కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ సమీపంలోని రేడియల్‌పై, ఈదులనాగులపల్లి గ్రామ ముఖద్వారం, వెలిమెల, కొల్లూరు, విద్యుత్‌నగర్ ముత్తంగి, రోడ్ల పక్కల పెద్ద ఎత్తున చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి.
అస్తవ్యస్తంగా చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఐదెకరాల్లో రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డ్‌ను అధికారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. పొడి,తడి చెత్తను వేరు చేయకుండా ముత్తంగి, వెలిమెల, అనేక ప్రాంతాలలో చెత్తను తగలబెడుతున్నారు.
అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్
గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు స్థలంను కేటాయించి పనులు మొదలుపెట్టారు. కానీ, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నిధులను నిలిపివేయడంతో ఇంటిగ్రేటెట్ మార్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
అక్రమ నిర్మాణాలకు అండగా
నూతనంగా మున్సిపల్‌లో విలీనమైన గ్రామాల పరిధిలో అధికారుల అండతో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
రోడ్లపై మట్టి
తెల్లాపూర్‌లో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రేడియల్ రోడ్డుపై పెద్ద ఎత్తున మట్టి కుప్పలున్నా వాటిని తొలగించిన పాపానపోవడంలేదు. దాంతో కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు.
వెలగని దీపాలు
మున్సిపల్ పరిధిలోని పలుచోట్ల రోడ్లపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రిసమయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. తెల్లాపూర్‌లోని మైఫేర్, రేడియల్ రోడ్డుతోపాటు పలు ప్రాంతాలలో విద్యుత్ దీపాలు వెలగడం లేదు.
ఆసుపత్రికి స్థలం కేటాయించినా...
జనాభాకు సరిపడా ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తెల్లాపూర్‌లో 30పడకల ఆసుపత్రిని మంజూరు చేసి అందుకు కావాల్సిన స్థలాన్ని సైతం కేటాయించింది. కానీ, పనులను మాత్రం ప్రారంభించడం లేదు.
పనిచేయని సీసీ కెమెరాలు
తెల్లాపూర్, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో విద్యుత్‌నగర్ కాలనీలలో సుమారు 300 సీసీ కెమెరాలున్నాయి. కానీ అందులో సుమారు 200పైగా సీసీ కెమెరాలు పనిచేయడంలేదు.

ఆదాయంపై శ్రద్ధ.. సమస్యలపై అశ్రద్ధ

ఆదాయంపై శ్రద్ధ.. సమస్యలపై అశ్రద్ధ

ఆదాయంపై శ్రద్ధ.. సమస్యలపై అశ్రద్ధ

ఆదాయంపై శ్రద్ధ.. సమస్యలపై అశ్రద్ధ

ఆదాయంపై శ్రద్ధ.. సమస్యలపై అశ్రద్ధ

ఆదాయంపై శ్రద్ధ.. సమస్యలపై అశ్రద్ధ