
నిండా ముంచిన నకిలీ మందులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): పంట ఎర్రబడుతుందని, దోమకాటు రక్షణకు మందులను పిచికారీ చేస్తే ఉన్న వరి పంట ఎండుముఖం పట్టింది.. ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు ఏకంగా ఆరు ఎకరాల పంటను నకిలీ మందులు నట్టెట ముంచాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగదేవ్‌పూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చేబర్తి బాల పోచయ్య తనకున్న రెండు ఎకరాలతోపాటు 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని యాసంగిలో వరి సాగు చేశారు. కెనాల్ కాల్వ, బోర్ల ద్వారా పంటకు సాగునీరు పెడుతూ పంటను కాపాడుకుంటున్నాడు. కాగా వరి పంట ఎర్రబడుతుందని, పొట్ట సమయంలో దోమ కాటు నివారణ కోసం గజ్వేల్‌లోని శ్రీనిధి ట్రేడర్స్‌లో రూ.4,050 చెల్లించి ట్రెండ్, అచిబు వరి మందులను తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరు ఎకరాల వరి పంటకు పిచికారీ చేశారు. బుధవారం ఉదయం వరి పంటను చూసేసరికి ఎండుముఖం పట్టింది. దీంతో సదరు రైతు చేతికొచ్చే సమయంలో వరి ఎండిపోవడంతో ఆందోళనకు గురి అయ్యారు. వెంటనే మందులు కొనుగోలు చేసిన డీలర్‌కు సమాచారం అందించారు. పంటను చూసి సదరు మందుల కంపెనీ దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టినట్లు రైతు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఎర్రబడుతుందని పిచికారీ చేస్తే
ఎండిపోయింది
ఆరు ఎకరాల పంట
నష్టపోయాయని ఓ రైతు ఆవేదన