ఒక్కప్లాటు కోర్టు కేసులో ఉన్నా.. సర్వే నంబర్‌లోని అన్ని ప్లాట్లు నిషేధిత జాబితాలోకి..
● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు ● వెంచర్‌లో ఖాళీ స్థలాలు లేకపోయినా ఓపెన్‌స్పేస్ చార్జీలు కట్టాల్సిందే. ● ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియ తీరు.. ● మిగతాచోట్ల అంతంతమాత్రం స్పందన
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ ఇక్కట్లు కిషన్‌రావు, లక్ష్మణ్‌లదే కాదు. తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు ముందుకొస్తున్న వేలాది మంది దరఖాస్తుదారులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లిస్తే 25% డిస్కౌంట్ ఇస్తామని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేస్తోంది. కానీ ఈ ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్య లెవల్–1 స్థాయి అధికారుల వద్ద పరిష్కారమవుతుందా.. లెవల్–2 అధికారుల పరిధిలోకి వస్తుందా..? లెవల్ –3 అధికారు ల వద్దకు వెళ్లాలా తెలియక తికమకపడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
నిషేధిత జాబితా కష్టాలు..
ఒక లేఅవుట్‌లోని సర్వేనంబర్‌లో 200 ప్లాట్లు ఉంటే.. అందులో ఒకటీ.. రెండు ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉంటే.. ఆ సర్వే నంబర్‌లోని అన్ని ప్లాట్లను నిషేధిత (ప్రొహిబీటెడ్) జాబితాలో చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలామంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సంబంధిత సబ్ రిజిష్ట్రార్ నుంచి ఎన్‌ఓసీ తీసుకుని ఎల్–1 స్థాయి అధికారులను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.
కనిపించని ఓపెన్‌స్పేస్‌లు..
అనధికారిక వెంచర్లు వేసిన అక్రమార్కులు చాలా చోట్ల ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన 10% స్థలాలను (టెన్ పర్సెంట్ ల్యాండ్)లను ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నారు. ఆయా కాలనీల్లో బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కు వంటి వాటి నిర్మాణం కోసం ఈ స్థలాలను కేటాయించాలి. నిబంధనల ప్రకారం ఈ 10% భూమిని సంబంధిత మున్సిపాలిటీగానీ, గ్రామపంచాయతీ తన అధీనంలోకి తీసుకోవాలి. కానీ అధికారులు వెంచర్ నిర్వాహకులతో చేతులు కలపడంతో ఈ ప్రజావసరాల ల్యాండ్ కూడా పరాధీనమైపోయింది. కానీ, ఈ అనధికారిక లేఅవుట్‌లో ప్లాటు కొన్నందుకు లేని ఓపెన్ స్పేస్‌కు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దరఖాస్తుదారులకు ఏర్పడింది.
డాక్యుమెంట్స్ షార్ట్‌ఫాల్ పేరుతో...
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో చాలామందికి డాక్యుమెంట్ షార్ట్‌ఫాల్ అని వెబ్‌సైట్‌లో చూపుతోంది. అయితే ఏ డాక్యుమెంట్ అవసరమో సాధారణ దరఖాస్తుదారులకు తెలియడం లేదు. సేల్‌డీడ్, ఈసీ, లింక్‌డాక్యుమెంట్లు, లేఅవుట్‌కాపీ డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. వీటిని నీర్ణీత సైజులో స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అయితే అంతగా అవగాహన లేని వారికి ఈ సాకేంతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ వివరాలిలా...
వచ్చిన దరఖాస్తులు: 90,546
అప్రూవ్డ్ అయినవి: 54,315
ఫీజు చెల్లించినవి: 8,829
ఇంకా ఫీజు చెల్లించాల్సినవి: 45,514
మండల స్థాయి హెల్ప్‌డెస్క్‌ల్లో సమాచారం అంతంతే..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్‌ల్లో పనిచేస్తున్న సిబ్బందికి చాలామందికి ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో ఉన్న సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ.. చాలామందిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల నుంచి, మండలాల నుంచి దరఖాస్తుదారులు కలెక్టరేట్‌లకు తరలివస్తున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి కిషన్‌రావు జోషి. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో ఓ అనధికారిక లేఅవుట్‌లో 150 గజాల ప్లాట్‌ను 2018లో కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద తన ప్లాటును క్రమబద్దీకరించుకునేందుకు ప్రయత్నించగా..ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్ సిటిజన్ లాగిన్ చేస్తే ప్రొహిబిటెడ్ అని చూపిస్తోంది. స్థానిక అధికారులకు సంప్రదించగా సరైన సమాచారం దొరకలేదు. సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను సంప్రదించగా.. సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) తీసుకురావాలని చెప్పారు. దీంతో జోషి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పరుగులు పెట్టారు.
రామచంద్రాపురానికి చెందిన లక్ష్మణ్ (పేరు మార్చాం). మండలంలోని పటాన్‌చెరు మండలంలో ఓ అనధికారిక లేఅవుట్‌లో ప్లాటు కొనుగోలు చేశారు. ప్రజావసరాల కోసం గ్రామపంచాయతీకి వదలాల్సిన 10% భూమిని కూడా వెంచర్ వేసిన అక్రమార్కుడు ప్లాట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. కానీ లక్ష్మణ్ మాత్రం 10% ల్యాండ్‌కు సంబంధించిన ఓపెన్‌స్పేస్ చార్జీలు 14% చెల్లించాల్సి వస్తోంది. ఓపెన్ స్పేస్ అసలు లేకపోయినప్పటికీ ఈ ఓపెన్‌స్పేస్ చార్జీలను తాను ఎందుకు చెల్లించాలని లక్ష్మణ్ వాపోతున్నారు.
క్రమబద్ధీకరణ కష్టాలు