● వందశాతం వసూలు అనుమానమే! ● ఇప్పటివరకు రూ.5.90 కోట్లు వసూలు ● ఆస్తిపన్ను చెల్లించాలంటున్న అధికారులు
ప్రయత్నాలు చేస్తున్నాం
ఆస్తి(ఇంటి) పన్ను వసూలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రచారం వాహనంతో ప్రతీ రోజు పట్టణంలో చాటింపు వేయిస్తున్నాం. ప్రజలు కూడా పూర్తిగా సహకరించి ఆస్తిపన్ను చెల్లించాలి. మొండు బకాయిలు కల్గిన వారికి 90% వడ్డీలో రాయితీ ఇచ్చాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 31 లోగా పూర్తి బిల్లులు చెల్లించాలి.
–ఉమా మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్, జహీరాబాద్
జహీరాబాద్‌టౌన్: జహీరాబాద్ మున్సిపల్‌కు ఇచ్చిన ఆస్తి పన్ను వసూలు గడువు ఇంకా మూడురోజులే ఉంది. ఇప్పటివరకు రూ.5.90 కోట్లు వసూలు చేయగా ఇంకా రూ.11 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గడువు దగ్గర పడుతుండటంతో వంద శాతం పన్ను వసూలు అనుమానంగా ఉంది. మార్చి 31తో నిర్దేశించిన గడువు ముగిస్తుండటంతో పన్ను వసూల్‌కు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో 37 వార్డులున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన మున్సిపాలిటీలో ఇళ్లు, వ్యాపార సంస్థలు 29,000 పైగా ఉన్నాయి. పట్టణ విస్తీర్ణంతోపాటు ప్రతీ ఏటా నూతన నిర్మాణాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రతి ఏడాది ఆస్తి పన్ను కూడా పెరుగుతుంది. ఇళ్లు, వ్యాపార సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కలిపి 2024–25 ఆర్థిక ఏడాదికి మున్సిపల్‌కు ఇంటి పన్ను రూ.17 కోట్లు డిమాండ్ ఉంది.
పది బృందాల ఏర్పాటు
ఇంటి పన్ను వసూలుకు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారు. బిల్‌కలెక్టర్‌లు కలుపుకుని 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కోక్క టీంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఏరియాను బట్టి టార్గెట్‌ను నిర్దేశించి అధికారులు వసూళ్లకు పంపుతున్నారు. ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రతీరోజు పట్టణంలో తిప్పుతున్నారు. అయినా ఆశించిన మేరకు ఆస్తి పన్ను వసూలు కావడంలేదు. గడువు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నందున వందశాతం వసూలు అసాధ్యమంటున్నారు. మొండి బకాయిలు సైతం పేరుకుపోయాయి. వాటిని వసూల్ చేసేందుకు మున్సిపల్ అధికారులు వడ్డీలో 90 శాతం రాయితీ ప్రకటించారు. వడ్డీలో కేవలం పదిశాతం చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అయినా ఇప్పటి లక్ష్యం అధిగమించడం అనుమానంగా ఉంది.