రైతుల కన్నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

రైతుల కన్నీటి కష్టాలు

Published Wed, Apr 2 2025 7:32 AM | Last Updated on Wed, Apr 2 2025 7:32 AM

రైతుల కన్నీటి కష్టాలు

రైతుల కన్నీటి కష్టాలు

మిరుదొడ్డి(దుబ్బాక): మునుపెన్నడూ లేని విధంగా మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. చెరువుల్లో చుక్క నీరు కానరావడం లేదు. వ్యవసాయ బావుల్లో నీటి తడులు అసలే లేవు. బోరు బావులు సైతం వట్టిపోతున్నాయి. ఆశ చావని రైతులు మరిన్ని అప్పులు చేసి బోరు బావులు తవ్వినా చుక్క నీరు రాక పోవడంతో మరింత నిరాశా నిస్ప ృహలకు లోనవుతున్నారు. కళ్ల ముందే పంటలు ఎండు ముఖం పడుతుంటే ఏం చేయాలో తోచక రైతులు చేతులెత్తేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో నీటి తడులులేక పొట్ట దశలో వరి సాగు, ఆరుతడి పంటలు ఎండిపోయి నష్టాలను చవి చూస్తున్నారు. ఈ క్రమంలోనే మిరుదొడ్డి మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో అడుగు పెడితే చాలు సాగు నీటి కష్టాలు కళ్ల ముందు దర్శనమిస్తుంటాయి. ఏం చేయాలో పాలుపోక బొట్టు బొట్టునూ ఒడిసి పడుతూ పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. సాగు నీరు లేక కొందరు రైతులు పంటలను వదిలేయగా, కాస్త నీటితోనైనా పంటలకు దక్కించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు.

ట్యాంకర్లతో వరికి నీరు

పొట్ట దశలో వరి వాడుముఖం పడుతుండటంతో కొందరు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వరి సాగుకు నీటిని అందిస్తున్నారు. ఎంతో కొంత పోస్తున్న బోరు బావుల యజమానులతో మాట్లాడి ట్యాంకర్‌లో నీటిని నింపుకోవడానికి బేరాలు ఆడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్‌ ఇంజన్‌తోపాటు నీటి ట్యాంకర్‌కు రూ.1,500 చెల్లిస్తున్నారు. అయినా మండుటెండల్లో పొలం తడపడానికి ట్యాంకర్‌ నీరు ఏ మూలకు సరి సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకంటే ట్యాంకర్‌ ద్వారా నీటిని అందించడమే మరింత ఆర్థిక భారంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇంత చేస్తే పెట్టిన పెట్టుబడులు వస్తాయోరావోనని ఆందోళన చెందుతున్నారు.

అడుగంటిన భూగర్భ జలాలు

ఎండుతున్న పంటలు

ఫాం పాండ్స్‌ ఏర్పాటు చేసుకొని నీటిని ఒడిసిపడుతున్న రైతులు

ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు

మిరుదొడ్డిలో అన్నదాతల అవస్థలు

బొట్టు బొట్టును ఒడిసి పట్టి

బోరు బావులు వట్టి పోవడంతో బీర, మిరప, తమాట, మిర్చి వంటి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వచ్చీరాని నీటిని ఒడిసి పట్టాలన్న ఆలోచనతో కొందరు రైతులు గుంతలు తవ్వి నీటిని నింపడానికి శ్రీకారం చుట్టారు. 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 5 మీటర్ల లోతుతో (ఫాం పాండ్స్‌) నీటి గుంతలను తవ్వుకుంటున్నారు. నీటి గుంతల అడుగుతోపాటు, చుట్టూ గోడల నుంచి నీరు ఇంకి పోకుండా ఉండేందుకు పాలిథిన్‌ కవర్లను అమర్చుతున్నారు. ఒక్కో నీటి గుంతకు రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నారు. వచ్చే కొంచెం నీటిని గుంతల్లో నింపుతున్నారు. ఆ నీటిని ఆరుతడి సాగు చేస్తున్న బీర, కాకర, మిర్చి, తమాట వంటి పంటలకు డ్రిప్‌ ద్వారా అందిస్తూ గట్టెక్కుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement