
ఈద్ మిలాప్‌లో దామోదర
మునిపల్లి(అందోల్): పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. బుధవారం మండలంలోని కంకోల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ముస్లిం సోదరులకు మంత్రి దామోదర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మంత్రికి మాజీ జడ్పీటీసీ అసద్‌పటేల్ తదితరులు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గొల్ల అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు రసూల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతం
రూ.18 వేలకు పెంచాలి
నారాయణఖేడ్: పంచాయతీ కార్మికులు, ఆశ కార్మికుల కనీసవేతనాలను రూ.18 వేలకు పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. బుధవారం ఖేడ్‌లో పంచాయతీ కార్మికులు, ఆశ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు వేతనాలను రూ.18 వేలకు పెంచుతామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శించారు. హామీలు నెరవేర్చకుంటే రాబోవు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం డివిజన్ కార్యదర్శి రమేష్, నాయకులు సతీష్, ఎల్లయ్య, బాలప్ప, జనాబాయి, కృష్ణవేణి, పుణ్యమ్మ, విజయలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ఎస్పీ
సంగారెడ్డి జోన్: జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. బుధవారం సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో పుష్పగుచ్చం అందించి, మర్యాదపూర్వకంగా కలిశారు.
4, 5 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ
జిల్లా మహాసభలు
నారాయణఖేడ్: అందోల్ డివిజన్ పరిధిలోని జోగిపేటలో ఈనెల 4, 5 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఏఐ జిల్లా 7వ మహాసభలను నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.సతీష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న తీరును చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఉపాధ్యాయురాలు సస్పెన్షన్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణం మయూరినగర్ కాలనీలోని ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయురాలు బి.సుజాత పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. అలాగే.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా గతేడాది డిసెంబర్ నుంచి ప్రైవేట్ ఉపాధ్యాయుని నియమించిన విషయం డీఈవో దృష్టికి వచ్చింది. దాంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభియోగంపై ఉపాధ్యాయురాలు బి.సుజాతను సస్పెండ్ చేశారు.
కొండాపూర్ ఆర్‌ఐపై వేటు
కొండాపూర్(సంగారెడ్డి): వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవతవకలకు పాల్పడిన కొండాపూర్ ఆర్‌ఐ మహదేవ్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ క్రాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. తహసీల్దార్ అనితను నారాయణఖేడ్ ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేట్ అధికారిగా బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. వారసత్వ ధ్రువపత్రం విషయంలో ఆర్‌ఐగా మహదేవ్ తప్పుడు పంచనామా నివేదిక ఇవ్వగా, దాని ప్రకారం తహసీల్దార్ సైతం ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేశారు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈద్ మిలాప్‌లో దామోదర