
హాస్టల్ విద్యార్థి అదృశ్యం
వట్‌పల్లి(అందోల్): సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం దేవునూరు బాలుర హాస్టల్ నుంచి ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పక్షం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని పెద్దతండాకు చెందిన మెగావత్ కుమార్(15) దేవునూరు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ.. అదే గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఉంటున్నాడు. గత నెల మార్చి 20న కుమార్ పాఠశాలకు హాజరుకాగా.. అదే రోజున సాయంత్రం హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా అదే తండాకు చెందిన పలువురు విద్యార్థులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోగా..తమ కుమారుడు రాలేదని కుమార్ తల్లిదండ్రులు వార్డెన్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే.. కుమార్ ఇంటికి వెళ్లినట్లు వార్డెన్ సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. వార్డెన్‌ను నిలదీశారు. అనంతరం వారు శుక్రవారం వట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ సుధాకర్ వివరాలు సేకరించే క్రమంలో మార్చి 29 వరకు విద్యార్థి హాస్టల్‌లో ఉన్నాడని, తర్వాత కనపించలేదని వార్డెన్ చెప్పే మాటలకు, స్కూల్ రిజిస్టర్‌లో మార్చి 20 వరకు మాత్రమే విద్యార్థి హాజరైనట్లుగా నమోదై ఉంది. వార్డెన్ మాటలకు పొంతన లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ తీరును నిరసిస్తూ విద్యార్థులతో కలిసి హాస్టల్ గేటు ఎదుట బైఠాయించారు. విషయం తెలిసిన జోగిపేట సీఐ అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు. విద్యార్థి తల్లి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
15 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి..
హాస్టల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ధర్నా

హాస్టల్ విద్యార్థి అదృశ్యం