దుర్గంధమే శ్వాసగా... సాగిపోవాలిక్కడ | - | Sakshi
Sakshi News home page

దుర్గంధమే శ్వాసగా... సాగిపోవాలిక్కడ

Published Sat, Apr 5 2025 7:12 AM | Last Updated on Sat, Apr 5 2025 7:12 AM

దుర్గంధమే శ్వాసగా... సాగిపోవాలిక్కడ

దుర్గంధమే శ్వాసగా... సాగిపోవాలిక్కడ

సంగారెడ్డి జోన్‌: ప్రధాన జాతీయ రహదారికి ఇరువైపులా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండాల్సిన పరిసరాలు అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ, పట్టింపులేనితనంతో రోడ్డు పక్కన ఇష్టారాజ్యంగా చెత్తను డంపింగ్‌ చేస్తున్నారు. చెత్తను, వ్యర్థాలను పారేయడంతో రాకపోకలు సాగించేవారు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డున వెళ్లాలంటే ‘సాహసం శ్వాసగా చేసుకుని’ప్రయాణించాలని వ్యంగ్యంగా చెబుతున్నారు.

చెత్త కుప్పలు.... వ్యర్థ పదార్థాలు

హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్లే ప్రధాన జాతీయ రహదారి 65 జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణం మీదుగా వెళ్తుంది. రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సంగారెడ్డిపట్టణం నుంచి జహీరాబాద్‌ వెళ్లే రహదారి పక్కన పచ్చని చెట్ల కింద చెత్తను కుప్పలు కుప్పలుగా పారబోస్తున్నారు. అంతే కాకుండా వృథాగా మిగిలిన కూరగాయలు, వివిధ రకాల పండ్లు ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. సంచులలో నింపి పారేసి వెళ్తున్నారు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న క్రమంలో సంగారెడ్డి శివారులో రోడ్డు పక్కన ప్లాస్టిక్‌ కాగితాలు చెత్త విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. దీంతో రహదారుల పక్కన డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తున్నాయి.

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

రహదారులకు ఇరువైపులా చెత్తకుప్పలను వేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బలమైన గాలులు వీచిన సమయంలో చెత్తకుప్పలో నుంచి ప్లాస్టిక్‌ కాగితాలు, చెత్తాచెదారం రహదారుల పైకి వస్తోంది. చెత్తకుప్పలకు మంట పెట్టిన సమయంలో వచ్చే పొగతో ఇబ్బందులు తప్పడం లేదని వాహనదారులు చెబుతున్నారు. ఫలితంగా వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.

మూగజీవాలకు సైతం ఇబ్బందులు

చెత్త వేసిన ప్రాంతాలలో పశువులు సంచరించడంతో వాటికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కుళ్లిన వ్యర్థాలు తినడంతో రోగాల బారిన పడే అవకాశం ఉంది. రహదారులకు ఇరువైపులా చెత్తను వేయకుండా చూడాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన కనీసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు చెబుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు చెత్తను పారబోయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. చెత్తను ఇష్టానుసారంగా పారబోస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.

వెదజల్లుతున్న దుర్వాసన

వివిధ రకాల కూరగాయలు, పండ్లు ఇతర రకాల వ్యర్థాలను ఇష్టానుసారంగా పారేస్తున్నారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉండటంతో కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. తోడుగా కురిసిన వర్షం నీటికి మరింతగా భరించలేని కంపు కొడుతోంది. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించే వాహనదారులు దుర్వాసనకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అంతేకాకుండా పలు సందర్భాలలో చెత్తను కుప్పలు గా వేసి తగలబెడుతున్నారు. వృక్షాలుగా మారిన మొక్కలు కాలిపోతున్నాయి.

జాతీయ రహదారిపక్కనే చెత్త డంపింగ్‌

కుప్పలు కుప్పలుగా వ్యర్థ పదార్థాలు

ఇష్టానుసారంగా వదిలేస్తున్న వైనం

రహదారుల పక్కన వెదజల్లుతున్న దుర్వాసన

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement