
నిండుకున్న నిల్వలు
సంగారెడ్డి పట్టణంలో ఉన్న ఓ రేషన్‌షాపులో ప్రతినెలా సుమారు 98 క్వింటాళ్ల బియ్యం పంపిణీ అవుతుంటాయి. ఈ రేషన్‌షాపునకు ఈ నెలలో కేవలం 60 క్వింటాళ్లు మాత్రమే సన్నబియ్యం వచ్చాయి. రేషన్‌కార్డుదారులందరు వచ్చి బియ్యం తీసుకోవడంతో వచ్చిన స్టాక్
రెండు రోజుల్లో అయిపోయింది. దీంతో మిగిలిన కార్డుదారులందరూ నిరాశతో వెనుదిరిగి పోయారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే జిల్లా అవసరాల మేరకు ఈ సన్నబియ్యం నిల్వలు జిల్లాకు రాలేదు. దీంతో చాలా రేషన్‌షాపుల్లో ఈ బియ్యం పంపిణీకి బ్రేకు పడింది. సన్నబియ్యం కోసం రేషన్‌షాపులకు వెళ్లిన కార్డుదారులు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ప్రస్తుతం స్టాక్ లేదని, రెండు రోజుల్లో స్టాక్ వచ్చాక ఇస్తామని రేషన్‌షాపుల నిర్వాహకులు కార్డుదారులకు సర్ది చెబుతున్నారు.
పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డిల నుంచి..
సంగారెడ్డి జిల్లాలో సన్నధాన్యం సాగు తక్కువే. కొంతమంది రైతులు ఈ సన్న రకాలను సాగు చేసినప్పటికీ వారి సొంత అవసరాలకే వాడుకుంటారు. దీంతో సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్దగా రాదు. ఈ కారణంగా జిల్లాలో సన్నబియ్యం అందుబాటులో లేవు. అయితే జిల్లా అవసరాల కోసం ప్రభుత్వం నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి సన్నబియ్యాన్ని సంగారెడ్డి జిల్లాకు తరలిస్తోంది. సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లి నుంచి ఇక్కడికి లారీలు రావాలంటే తీవ్ర జాప్యం జరుగుతోంది. నిజామాబాద్ నుంచి రావాలన్నా 160 కిలోమీటర్లు రవాణా చేయాల్సి వస్తోంది. పక్కనే ఉన్న మెదక్, కామారెడ్డి జిల్లాల నుంచి కేటాయింపులు జరిపినా అవి తక్కువగానే ఉన్నాయి. దీంతో ఈ బియ్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోజుకు 30 నుంచి 35 లారీలు మాత్రమే వస్తున్నాయి. దీంతో జిల్లా భారీ అవసరాల మేరకు సన్నబియ్యం స్టాక్ సకాలంలో చేరడం లేదు.
60 శాతమే వచ్చిన సన్నబియ్యం..
జిల్లాలో మొత్తం 3.78 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఈ కార్డుదారులకు మొత్తం 846 రేషన్‌షాపుల ద్వారా ప్రతినెలా 7,990 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే శనివారం నాటికి జిల్లాకు వచ్చిన సన్నబియ్యం సుమారు 4,794 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా సుమారు 3,196 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రావాల్సి ఉందని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు.
సన్నబియ్యం పంపిణీకి బ్రేక్
పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల నుంచి
రోజుకు 30 లారీలే రాక
పూర్తిస్థాయిలో జిల్లాకు చేరని వైనం
కార్డులు ఎక్కువ ఉన్న
షాపులకు సగమే పంపిణీ..
స్టాక్ వచ్చాక ఇస్తామంటున్న
అధికారులు
కేటాయింపుల్లోనే ఆలస్యం
బియ్యం కేటాయింపులో ఆలస్యం కారణంగానే స్టేజ్–1 స్థాయిలో సన్నబియ్యం రవాణాలో జాప్యం జరుగుతోంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖ అధికారులు ఈ కేటాయింపుల విషయంలో చొరవ చూపకపోవడంతో సన్నబియ్యం స్టాక్ రాకపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రానున్న నెల నుంచి ప్రతినెలా 20వ తేదీలోగా కేటాయించాలని కలెక్టర్ పౌరసరఫరాలశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.
త్వరగా తెప్పిస్తున్నాం..
సన్నబియ్యం నిల్వలను వీలైనంత త్వరగా తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పక్క జిల్లాలు కాకుండా దూరంగా ఉన్న పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలు కేటాయించడంతో ఈ బియ్యం నిల్వలు రావడంలో కాస్త సమయం పడుతోంది. రెండు రోజుల్లో నిల్వలను జిల్లాకు తెప్పించి..కార్డుదారులందరికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిరుపేదలు నివాసముండే ప్రాంతాల్లోని రేషన్‌షాపులకు ముందుగా ఈ బియ్యాన్ని తరలిస్తున్నాం. తర్వాత రామచంద్రాపురం, పటాన్‌చెరు వంటి అర్బన్ ప్రాంతాల్లోని రేషన్‌షాపులకు నిల్వలు పంపుతాం.
–మాధురి, అదనపు కలెక్టర్

నిండుకున్న నిల్వలు