
అంగన్‌వాడీల్లో కంటి పరీక్షలు
నారాయణఖేడ్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఆరేళ్లలోపు చిన్నారులకు కంటి, మానసిన సమస్యలను గుర్తించేందుకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నెల 7న ప్రారంభించి రెండునెలల పాటు పూర్తయ్యే వరకు ఈ పరీక్షలు కొనసాగించనున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. జిల్లా మొత్తంలో 1,504 అంగన్‌వాడీ కేంద్రాల్లో 80,277మంది 0– 6 ఏళ్లలోపు చిన్నారులు పౌష్టికాహారం పొందుతూ చదువుకుంటున్నారు. వీరందరికీ కంటి, మానసిక పరీక్షలను చేయనున్నారు. ఇదివరకే రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) ద్వారా ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు రెండు విడతలుగా కంటి పరీక్షలను పూర్తి చేశారు. మూడో విడతగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు పరీక్షలు చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేది పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలే. కాగా, ఆయా పిల్లలు సరైన పర్యవేక్షణ లేక కంటి, మానసిన సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమస్యలు చిన్న తనంలోనే గుర్తించి సరిచేసేందుకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు ఉపక్రమించింది.
పరీక్షలు ఇలా..
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్ల వైద్య సిబ్బందితోపాటు ఆఫ్తాల్మిక్ నిపుణులు చిన్నారులకు లీచార్ట్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ టీచర్‌ను భాగస్వాములను చేస్తూ చిన్నారులకు ప్రత్యేకంగా బొమ్మలతో రూపొందించిన లీ చార్ట్ చూపిస్తూ ప్రశ్నించనున్నారు. చూపు సరిగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించనున్నారు. చిన్నారులకు కంటిలో ఏవైనా మచ్చలున్నాయా, దృష్టితోపాటు, మెల్లకన్ను, కార్నియా సమస్యలు, నిర్ధారిత దిశలో కళ్లు చూడకపోవడం, కళ్లల్లో తగినంత తేమ లేకపోవడం, పొడిబారుతుందా తదితర విషయాలపై ఆఫ్తాల్మిక్ నిపుణులు పరీక్షించనున్నారు. కంటి సమస్యలున్న చిన్నారులకు బోధనాస్పత్రుల్లో తగిన చికిత్సలు అందిస్తారు. మానసిక సమస్యలపై పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షలు నిర్వహించనున్నారు. చిన్నారుల ఎదుగుదల, ఎత్తు, బరువు, ఎలా మాట్లాడుతున్నారు? మాటలు సరిగా వస్తున్నాయా లేదా, ఆయా వస్తువులను గుర్తిస్తున్నారా లేదా, ప్రవర్తనల్లో ఏమైనా మార్పులున్నాయా అనే అంశాలను కూడా వైద్యులు అడిగి తెలుసుకుంటారు.
నేటి నుంచి ప్రారంభం
జిల్లావ్యాప్తంగా 1,504 కేంద్రాలు
80,277 మంది చిన్నారులకు పరీక్షలు
రెండునెలల పాటు కార్యక్రమం
పరీక్షలకు సిద్ధం
జిల్లాలోని 0– 6 ఏళ్లలోపు అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు కంటి, మానసిక ఎదుగుదలపై పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 7 నుంచి విద్యార్థులందరికీ పూర్తయ్యే వరకు రెండునెలలపాటు పరీక్షలు నిర్వహిస్తాం.
గాయత్రీదేవి, జిల్లా వైద్యాధికారి, సంగారెడ్డి

అంగన్‌వాడీల్లో కంటి పరీక్షలు